Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనర్హతా నోటీసులపై జులై 11 వరకు రెబెల్స్‌కు గడువు పొడిగింపు
- రెబెల్ ఎంఎల్ఎల ప్రాణాలకు ముప్పు వుందన్న షిండే
- రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్న న్యాయస్థానం
- 9 మంది రెబెల్స్‌ను తొలగించిన ఉద్ధవ్
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రానురానూ ఉధృతమవుతున్నది. అధికారం కోసం జరుగుతున్న ఈ పోరాటం అత్యున్నత న్యాయ స్థానానికి చేరింది. తమను అనర్హులుగా పేర్కొంటూ, డిప్యూటీ స్పీకర్ తనకు, మరో 15మంది ఎంఎల్ఎలకు అనర్హతా నోటీసులు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తూ రెబెల్ నేత ఏక్నాథ్ షిండే సుప్రీంను ఆశ్రయించారు. ఏ సభ్యుడినైనా అనర్హుడిని చేసేందుకు డిప్యూటీ స్పీకర్‌కు గల అధికారాన్ని కోర్టులో సవాలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో వుండగా ఆయన ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తిరుగుబాటు ఎంఎల్ఏల ప్రాణాలకు ముప్పు వుందని పేర్కొంటూ సుప్రీంలో షిండే మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. 50మందికి పైగా ఎంఎల్ఎల మద్దతు వుందని షిండే చెబుతుండగా, అందులో దాదాపు 40మంది శివసేనకి చెందిన వారే. కాగా, షిండే పిటిషన్‌పై స్పందించిన కోర్టు వారి ప్రాణ, ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తిరుగుబాటు ప్రకటించిన 9మంది రెబెల్ మంత్రుల పదవులను ఇతర మంత్రులకు అప్పగించారు. ఆ రెబెల్ మంత్రులందరూ ప్రస్తుతం గువహతిలో వున్నారు. అందువల్ల పాలనా సౌలభ్యం కోసం ఈ చర్య తీసుకున్నట్టు అధికార ప్రకటన పేర్కొంది. ఏక్నాథ్ షిండే శిబిరంలో 9మంది మంత్రులు చేరిన తర్వాత శివసేనకు ముఖ్య మంత్రి తో సహా నలుగురు కేబినెట్ మంత్రులు వున్నారు. వీరిలో కొడుకు ఆదిత్య థాక్రేను మినహాయిస్తే, మిగిలిన ముగ్గురు ఎంఎల్‌సిలే. శివసేన నేతృత్వం లోని మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వంలో తిరుగుబాటుకు ముందు శివసేనకు పదిమంది కేబినెట్ మంత్రులు వున్నారు. నలుగురు సహాయ మంత్రులు వున్నారు. ఇప్పుడు నలుగురు సహాయ మంత్రులు తిరుగుబాటు వర్గంలోనే వున్నారు. ఇదిలావుండగా, సుప్రీంలో రెబెల్స్‌కు కాస్తంత ఉపశమనం లభించింది. అనర్హతా నోటీసులపై ప్రతిస్పందించడానికి జులై 11 వరకు గడువును పొడిగించింది. అప్పటివరకు అనర్హతా చర్యలను నిలిపివేసింది. అయితే మొదటగా బాంబే హైకోర్టుకు వెళ్ళకుండా సుప్రీంకు ఎందుకువచ్చారని సుప్రీం ప్రశ్నించింది. ఈలోగా అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహి ంచరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధన పై తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు తిరస్క రించింది. రెబెల్ ఎంఎల్ఎలు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలు, వారి ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభు త్వానిదేనంటూ వెకేషన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రెబెల్ ఎంఎల్ఎలు అందచేసిన అవిశ్వాస నోటీసుపై అఫిడవిట్ ఇవ్వాల్సిందిగా డిప్యూటీ స్పీకర్‌ను కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించారనీ, రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత అరాచకాన్ని రెచ్చగొట్టా రని పేర్కొంటూ బాంబే హైకోర్టులో ఏక్నాథ్ షిండేకి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల పిటిషన్ దాఖలైంది. విధులను నిర్వర్తించకుండా, తప్పుడు చర్యలకు పాల్పడినందుకు రెబెల్ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని ఆ పిల్ కోరుతోంది. సెవన్ సిటిజన్ ఆఫ్ మహారాష్ట్ర ఈ పిల్‌ను దాఖలు చేసింది.