Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి..
- పాల్గొన్న రాహుల్, శరద్ పవార్, ఏచూరి తదితరులు
- వ్యక్తుల మధ్య కాదు..రెండు సిద్ధాంతాల మధ్య పోటీ : ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం పార్లమెంట్‌లోని రాజ్యసభ సెక్రెటేరియట్‌లో రాష్ట్రపతి ఎన్నిలక రిటర్నింగ్ అధికారి (రాజ్యసభ సెక్రెటరీ జనరల్) పిసి మోడీకి రాహుల్ గాంధీ, శరద్ పవార్, సీతారాం ఏచూరి, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. 50 మంది ప్రతిపాదించేవారు, మరో 50 మంది బలపరిచేవారు సంతకాలు చేసిన మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. తొలుత పార్లమెంట్లో కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ(ఎం), సీపీఐ, ఎస్పీ, ఆర్జేడీ, టీఆర్ఎస్, శివసేన, నేషనల్ కాన్ఫెరెన్స్, ఆర్ఎల్డీ, ఏఐయూడీఎఫ్, వీసీకే, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ తదితర పార్టీల నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ప్రచారం, మద్దతు కూడగట్టడం.. తదితర అంశాలపై చర్చించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్ (కాంగ్రెస్), అభిషేక్ బెనర్జీ, సౌగత్ రారు (టీఎంసీ), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), వి. శివదాసన్ (సీపీఐ(ఎం), ఎ.రాజా, తిరుచ్చి శివ (డీఎంకే), డి.రాజా (సీపీఐ), నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్) జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), మీసా భారతి (ఆర్జేడీ), తోల్. తిరుమావళవన్ (వీసీకే), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత యశ్వంత్ సిన్హా తన భార్య నీలిమాతో కలిసి పార్లమెంట్ ఆవరణంలో ఉన్న మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం విజరు చౌక్‌లో ప్రతిపక్ష సభ్యులతో కలిసి రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, తిరుచ్చి శివ, సౌగత్ రారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోటీ కాదనీ, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోటీ అని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. ''మేమంతా ఐక్యంగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాం. మేం వ్యక్తిగతంగా మద్దతు ఇస్తున్నప్పటికీ పోటీ మాత్రం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ద్వేషం, కోపం ఒకవైపు... కరుణ, దయాభావం కలిగిన ఏకతాటిపై నిలబడిన ప్రతిపక్ష పార్టీలు మరోవైపు'' అని రాహుల్ గాంధీ అన్నారు.
11 మంది సభ్యులతో ప్రచార కమిటీ
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రచారం కోసం 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జైరాం రమేష్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం), తిరుచ్చి శివ (డీఎంకే), సుఖేందు శేఖర్ రారు (టీఎంసీ), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), ప్రఫుల్ పటేల్ (ఎన్సీపీ), జి.రంజిత్ రెడ్డి (టీఆర్ఎస్), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), డి.రాజా (సీపీఐ), శివసేన ప్రతినిధి, సుఖేంద్ర కులకర్ణి (పౌర సమాజం) సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ప్రచారం, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ప్రచారం చేయాలో రూపొందిస్తుంది.
29న కేరళలో ప్రచారం
ఈ 29న నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రాల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. తొలుత ఈ నెల 29న కేరళలో ప్రచారం చేస్తారు. అనంతరం 30న తమిళనాడు, జులై 1న గుజరాత్, కర్నా టకలో జులై 2 ప్రచారం చేస్తారు. ఆ తరువాత మధ్యప్రదేశ్ షెడ్యూల్ పూర్తి అవుతుంది. టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీ రామారావు తమ రాష్ట్రానికి జులై 1 రావాలని యశ్వంత్ సిన్హాను ఆహ్వానించగా, అందుకు ఇప్పటికే జులై 1, 2 తేదీల షెడ్యూల్ ఖరారు కావడంతో ఆ తరువాత ఒక రోజు తెలంగాణకు వస్తామని చెప్పినట్టు సమాచారం.
రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ భక్షణ మధ్యే ఈ ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ భక్షణ మధ్య జరుగుతున్నాయని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ''దేశ రాష్ట్రపతి రాజ్యాంగ సంరక్షకుడు. నేడు దేశంలో దారణమైన దుస్థితి నెలకొంది. రాజ్యాంగాన్ని పరిక్షించాల్సిన అవసరం. దేశంలో ప్రాథమిక హక్కులు హననం జరుగుతుంది. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోటీ వ్యక్తుల మధ్య కాదు. సిద్ధాంతాల మధ్య పోటీ జరుగుతుంది. రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఈ పోటీ గుర్తింపు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న కాదు. బీజేపీ అలా చేయాలనుకుంటుంది. ద్రౌపది ముర్ము అంటే గౌరవిస్తాం. కానీ సిద్ధాంతాల నడుమే అసలైన పోటీ జరుగుతుంది'' అని పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రారు మాట్లాడుతూ ఇది కేవలం మతతత్వం-లౌకికతత్వం, నిరంకుశత్వం-ప్రజాస్వామ్యం మధ్య జరుగుతున్న పోరని అన్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రపతిగా యశ్వంత్ సిన్హానే ఉత్తమమైన అభ్యర్థి అని పేర్కొన్నారు. తమది దేశంలోని అత్యుత్తమ విలువల ఇంద్ర ధనస్సు కూటమని స్పష్టం చేశారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ రాజ్యాంగ పవిత్రతను కాపాడేందుకే తాము యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నామని అన్నారు. సమాఖ్యవాదం, లౌకికవాదం సమర్థించే అభ్యర్థికి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు.
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి