Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముర్షీదాబాద్ ఏరియాలో ప్రజల ఆందోళన
ఫరక్కా (ముర్షీదాబాద్) : అదానీ గ్రూపు నిర్మిస్తున్న ప్రమాదకరమైన విద్యుత్ ప్రాజెక్టును కొనసాగనివ్వబోమంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షీదాబాద్‌లోని ఫరక్కాలో రెండు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేపట్టారు. తమ అనుమతి, ప్రమేయం లేకుండా ఈ ప్రాజెక్టుతో ముందుకు సాగుతున్నారనీ, దీన్ని అనుమతించేది లేదని హై ట్రాన్స్మిషన్ టవర్ వున్న దాదన్టొలా గ్రామంలో వందలాదిమంది ప్రజలు ఆదివారం బైఠాయింపు జరిపారు. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కుదిరిన ద్వైపాక్షిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా కోసం అదానీ గ్రూపు ఈ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టింది. జార్ఖండ్‌లోని గొడ్దా జిల్లాలో గల తన విద్యుత్ ప్లాంట్ నుండి బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను అందించాలన్నది లక్ష్యంగా వుంది. ఇందుకోసం బెంగాల్‌లోని ముర్షీదాబాద్, మాల్దాల గుండా బంగ్లాదేశ్‌ను అనుసంథానించేలా ఈ టవర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే గత రెండు మాసాల్లో 83 టవర్లను ఏర్పాటు చేశారు. 11వేల మెగావాట్ల విద్యుత్‌ను తీసుకెళ్ళే 84, 85 టవర్ల నిర్మాణం ఆదివారం ప్రజల ఆందోళనతో నిలిచిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు గ్రామాల ప్రజలు ఆదివారం పోలీసులకు పలు ఫిర్యాదులు చేశారు. ఈ హై టెన్షన్ టవర్ల వల్ల తమ భద్రతకు తీవ్ర ప్రమాదం వుందని వారు పేర్కొంటున్నారు. టవర్ల నిర్మాణంతో ఈ ప్రాంతంలోని లిచీ సాగుకు కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని ఆందోళనకారులు తెలిపారు. ఈ ప్రాంతంలో లిచీ పంటకు డిమాండ్ ఎక్కువ. సంబంధిత కంపెనీతో, జిల్లా అధికారులతో చర్చలు జరిపిన మీదట పనులు చేపడతామని పోలీసులు, గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఒక్కో టవర్ నిర్మించేందుకు అవసరమైన భూమిని వ్యక్తిగత భూ యజమానుల నుంచి మార్కెట్రేటుకు అదానీ గ్రూపు కొనుగోలు చేసింది.