Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలకు బ్రేకఫాస్ట్గా బిస్కట్స్, చిరుతిండ్లు వద్దు!
- కర్నాటక బెల్గావ్ జిల్లాలో మహిళా కార్యకర్తలు ప్రచారం
- పోషకాహారలోపంపై 30గ్రామాల్లో సర్వే
న్యూఢిల్లీ : స్కూల్స్‌కు వెళ్తున్న తమ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా తల్లిదండ్రులు హడావిడిగా ఏదో ఒకటి ఇస్తున్నారు. అత్యధికమంది బిస్కట్లు, బయట కొన్న చిరుతిండ్లు పెడుతున్నారు. ఇది పిల్లల్లో పోషకాహారలోపానికి దారితీస్తోందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. కర్నాటకలోని బెల్గావ్ జిల్లాలో 'జాగృతి మహిళా ఒక్కూట' అనే సంఘం కార్యకర్తలు 30గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. పిల్లల ఆహార అలవాట్లపై ఇంటింటి సర్వే చేపట్టారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బయట నుంచి చిరుతిండ్లను కొని తమ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా అందిస్తున్నారని సర్వేలో తేలింది.
బిస్కట్లు, బయట కొన్న చిరుతిండ్లు కాకుండా ఇంటివద్ద వండిన అన్నం, కూర, లేదా రోటీ బ్రేకఫాస్ట్గా అందజేయాలని 30గ్రామాల్లో ప్రతి ఇంటికీ తిరిగి తల్లిదండ్రుల్ని కోరారు. పోషాకాహారంపై అవగాహన కల్పించారు. ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఏ ఏ గ్రామాల్లో అవగాహన కల్పించారో...అక్కడి పిల్లల్లో పోషకాహార లోపం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఒక చిన్న ప్రయత్నం, తమ పరిశోధోన అద్భుతమైన ఫలితాల్ని సాధించిందని 'జాగృతి మహిళా ఒక్కూట' తెలిపింది. ముఖ్యంగా పిల్లల తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నది.
పప్పు, ఆకుకూరలు చాలు
అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలతోనే పిల్లలకు మంచి బలం, ఆరోగ్యం వస్తుందని చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పప్పులు, ఆకు కూరలు, పాల పదార్థాలతో పిల్లలకు మంచి ఆహారం సమకూర్చవచ్చునని మేం వివరంగా తెలియజేశాం. పల్లీలు, బెల్లంతో తీపి పదార్థాలు చేయటమెలాగో చెప్పాం. సమతుల ఆహారం ఎంతముఖ్యమో వివరించాం. అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లను కలుసుకొని, వారిని భాగస్వాములు చేశాం.
- రాజశ్వేరీ జోషి, మహిళా సంఘం కార్యకర్త
సర్వేలో తేలిందేంటంటే.
వారానికి రెండు లేదా మూడు గుడ్లు తిన్న పిల్లల్లో పోషకాహార లోపం లేద ని సర్వే పేర్కొన్నది. అయితే కర్నాటక ప్రభుత్వం ఆ గ్రామాల్లో పిల్లలకు వారాని కి కేవలం రెండు గుడ్లు మాత్రమే సరఫరా చేస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల పిల్లల్లో పోషకాహార సమస్య ఒకే విధంగా ఉంది. అంగన్ వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ పథకం కింద ఇస్తున్న 'పుష్టి'ని తమ పిల్లలకు పెట్టడం వల్ల విరేచనాలబారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ప్యాకెట్లలోని పదార్థాన్ని పశువులకు మేతగా అందిస్తున్నారని తేలింది.