Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభావిత ప్రాంతాల స్థానికులతో చర్చలే లేవు..!
- బొగ్గు తవ్వకాల ప్రాజెక్టుల్లో మోడీ సర్కారు తీరు
- పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారుకు మైనింగ్ పరిశ్రమల విస్తరణపై ఉన్న శ్రద్ధ.. వాటి ద్వారా ప్రభావితమయ్యే ప్రజలపై కనబడటం లేదు. దేశంలోని బొగ్గు తవ్వకాల ప్రాజెక్టుల విస్తరణలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో దేశంలోని తొమ్మిది కోల్ మైనింగ్ ప్రాజెక్టుల్లో ఆరింటి విస్తరణకు పర్యావరణ అనుమతులు లభించాయి. అయితే, ఈ ఆరు ప్రాజెక్టుల విషయంలో మోడీ సర్కారు ప్రభావిత ప్రాంతాల ప్రజలతో ఎలాంటి చర్చలూ జరపలేదు. ఈ ఆరు ప్రాజెక్టుల సంయుక్త విస్తరణ సామర్థ్యం.. మిగతా మూడు ప్రాజెక్టుల(ఈ మూడింటిలో చర్చలు జరిగాయి) కంటే 200 శాతం అధికం కావటం గమనార్హం. ప్రభావిత ప్రాంతాల ప్రజలతో చర్చించకుండా ధనార్జనే ధ్యేయంగా కేంద్రం వ్యవహరిస్తున్న విధానంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్రం తీరు స్థానిక ప్రజలకు తీరని అన్యాయాన్ని చేస్తున్నదని పర్యావరణ, సామాజికవేత్తలు తెలిపారు.
సందేహాస్పదంగా పర్యావరణ అనుమతులు
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం.. దేశ బొగ్గు గనుల రంగంలో ఈ ఆరు ప్రాజెక్టుల సామర్థ్యం ఏడాదికి 10.70 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ). బహిరంగ చర్చలు జరిపి విస్తరణ చేపట్టిన మిగతా ఆ మూడు ప్రాజెక్టుల మొత్తం విస్తరణ సామర్థ్యం 5.35 ఎంటీపీఏ. అయితే, ప్రజలతో ఎలాంటి బహిరంగ చర్చలు, సమావేశాలు లేకుండా ప్రాజెక్టులకు కేంద్రం పర్యావరణ అనుమతులు ఇవ్వటం సందేహాస్పదంగా ఉన్నదని మైనింగ్ ద్వారా ప్రభావితమైన మైన్స్, మినరల్స్ అండ్ పీపుల్ (ఎంఎం అండ్ పీ) కు చెందిన రెబ్బా ప్రగడ రవి అన్నారు. ఇలాంటి అనుమతులు స్థానిక ప్రభావిత ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రత్యేక నిబంధనలను పరిగణలోకి తీసుకోవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి ముఖ్యంగా గిరిజన సమూహంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణవేత్తలు చెప్పారు.
2017లో కొత్త నిబంధన
బహిరంగ చర్చలతో సంబంధం లేకుండా బొగ్గు తవ్వకాల ప్రాజెక్టులను విస్తరించుకోవటానికి 2017లో మోడీ ప్రభుత్వం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. ప్రభావిత ప్రజలతో సంబంధం లేకుండా 40 శాతం వరకు మైనింగ్ ప్రాజెక్టులను విస్తరించుకోవచ్చు. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఈ నిబంధనే మైనింగ్ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు శాపంగా మారిందని సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లీగల్ ఇన్షియేటీవ్ ఫర్ ఫారెస్ట్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ (లైఫ్) అధ్యయనం ప్రకారం.. 2019-22 మధ్య మూడేండ్లలో 18 కోల్ మైనింగ్ విస్తరణ ప్రాజెక్టులకు పబ్లిక్ హియరింగ్ లేకుండానే మార్గం సుగమమైంది. 2019-21 మధ్య కోల్సెక్టార్కు ఈ ప్రాజెక్టుల సంయుక్త సామర్థ్యం అదనంగా 39.834 ఎంటీపీఏ కావటం గమనార్హం. ఈ ప్రాజెక్టుల విస్తరణ తీవ్ర ఆందోళనకరమని 'లైఫ్' వివరించింది. 2019-21 మధ్య దాదాపు 38 కోల్ మైనింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి.
అయితే, మోడీ సర్కారు మినహాయింపుల అనుమతులు ఒక్క కోల్ మైనింగ్ సెక్టార్‌కే కాదు.. ఇనుము, మాంగనీసు, బాక్సైట్, సున్నపురాయి వంటి ఖనిజాల మైనింగ్‌కూ కల్పించటం గమనార్హం. మైనింగ్ ప్రాజెక్టుల విస్తరణతో స్థానికండా ఉండే ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనీ, ఆ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే వివాదాస్పద నిబంధనను మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని నిపుణులు తెలిపారు. స్థానికులతో చర్చించాకే ప్రభుత్వం ముందుకెళ్లాలని సూచించారు.