Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభద్రతా భావంలో మోడీ సర్కార్ : సీతారాం ఏచూరి
- నియంతృత్వంపై గెలుస్తాం..భయపడొద్దు : రాహుల్‌గాంధీ
- మోడీ సర్కార్‌పై మండిపడ్డ ప్రతిపక్షాలు
- అరెస్టును ఖండించిన జర్నలిస్టు సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్‌ను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ''బీజేపీ విద్వేషం, మతఛాందసత్వం, అబద్ధాలను బయటపెట్టే ప్రతి వ్యక్తికి ముప్పు పొంచివుంది. సత్యం పలికే గళాన్ని అణచివేస్తే, వెయ్యి గళాలు కొత్తగా పుట్టుకొస్తాయి. సత్యం ఎల్లప్పుడూ నియంతృత్వంపై గెలుస్తుంది. భయపడవద్దు'' అని అన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ..''జుబెయిర్‌ను వెంటనే విడుదల చేయాలి. మోడీ ప్రభుత్వం అభద్రత భావంలో ఉంది. తప్పుడు సమాచారంతో ప్రచారం చేసే నకిలీ ద్వేషపూరిత యంత్రంగాన్ని బహిర్గతం చేసే వారిపై మోడీ ప్రభుత్వం బెదిరింపుకు దిగుతుంది'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్..''అబద్ధాల వ్యాపారులు నిజాన్ని పరిశోధించే వారిని ఇష్టపడరు. వారి తప్పుడు ధోరణి ఎత్తి చూపితే, ద్వేషం అనే విషాన్ని చిమ్ముతారు'' అని విమర్శించారు. బీజేపీ బూటకపు వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలో అత్యుత్తమ జర్నలిస్టు జుబెయిర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామనితృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. సీపీఐ(ఎంఎల్) నేత కవితా కృష్ణన్ ''జుబెయిర్ లాయిర్ల వద్ద రిమాండ్ కాపీ లేదు. కానీ ఫాసిస్ట్ ప్రచార టివి (రిపబ్లిక్ టివి) ఛానల్ వద్ద ఉంది. దీన్ని ఏమనాలి'' అని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా నరమేధం జరగాలని ఇచ్చిన నినాదాలపై ఢిల్లీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరని, కేవలం విద్వేష ప్రసంగాలను రిపోర్టు చేయడం, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం నేరాలుగా పరిగణించి వేగంగా చర్యలు తీసుకుంటారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి ఆరోపించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ''బ్రిటిష్ నిరంకుశ పాలనను ఎలా నడిపించారనేదానికి ప్రస్తుత పాలన ఒక ఉదాహరణ. జుబైర్‌ను అరెస్టు చేయడమంటే, బీజేపీ వైఫల్యాన్ని బట్టబయలు చేసే గొంతులను మూయించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను పునరుద్ధరించడానికి భారతదేశం ఐక్యంగా ఉంది'' అని అన్నారు. మహ్మద్ జుబైర్ అరెస్టును ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఖండించింది. ఈ మేరకు మంగళవారం పీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు ఉమాకాంత్ లఖేర, వినరు కుమార్‌లు ఒక ప్రకటన విడుదల చేశారు. జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భావప్రకటనా స్వేచ్చపై అణచివేత :జుబైర్ అరెస్టుపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
జర్నలిస్టు మహ్మద్ జుబైర్ అరెస్టును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ పోలీసులు భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' ఆరోపించింది. మహ్మద్ జుబైర్‌ను పిలిపించిన ఢిల్లీ పోలీసులు అరెస్టు చేస్తున్నామని హఠాత్తుగా ప్రకటించారు. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ జుబైర్‌పై ఆరోపణలు నమోదుచేశారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేశారు. 2018లో జుబైర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొన్ని సందేశాలు ఒక వర్గం ప్రజల మనోభావాల్ని దెబ్బతీశాయని, రెండు మతాల మధ్య విద్వేషాన్ని పెంచాయని పోలీసులు ఆరోపించారు.
ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ..తగిన సాక్ష్యాధారాలు ఉన్నందు వల్లే జుబైర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఆయనను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఆయనను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
ఎప్పుడో నాలుగేండ్ల క్రితంనాటి సోషల్‌మీడియా పోస్టుల్ని కారణంగా చూపి, ఇప్పుడు అరెస్టు చేయటమేంటని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మోడీ సర్కార్‌ను తప్పుబడుతున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా జుబైర్ అరెస్టుపై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఏముందంటే, ఈ దేశంలో మైనార్టీలకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ఎలా ప్రచారంలోకి తీసుకొస్తున్నారో జర్నలిస్టుగా జుబైర్ బయటపెట్టేవాడు. మైనార్టీల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తాడు. ఈనేపథ్యంలో పాలకులు జుబైర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు'' అని ప్రకటనలో పేర్కొన్నారు. ఆమ్నెస్టీ ఇండియా ఛైర్మెన్ ఆకార్ పటేల్ జుబైర్ అరెస్టుపై స్పందిస్తూ..''ఈ దేశంలో మానవ హక్కుల కోసం పోరాడుతున్నవారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో ఈ ఉదంతం తెలియజేస్తోంది. హక్కుల కార్యకర్తలను వేధించటం, ఏకపక్షంగా అరెస్టు చేయటం సర్వసాధారణమై పోయింది'' అని అన్నారు.
జుబైర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన్ని వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ పోలీసులను ఆకార్ పటేల్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలపై వేధింపుల్ని వెంటనే ఆపేయాలని ఆయన అన్నారు. ఢిల్లీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తద్వారా నిరసనగళాన్ని వినిపిస్తున్నవారికి ఒక సందేశాన్ని పంపుతున్నారని పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నోటీస్లేదు..ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు : ప్రతీక్ సిన్హా
జుబైర్ అరెస్టును ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీచేశారని, అయితే ఆ కేసులో అరెస్టు చేయకుండా హైకోర్టు నుంచి జుబైర్‌కు రక్షణ ఉందని తెలిపారు. దాంతో మరో కేసులో జుబైర్‌ను అరెస్టు చేశారని, దానికి సంబంధించి ముందస్తు నోటీసులుగానీ, ఎఫ్ఐఆర్ కాపీగానీ ఇవ్వలేదని ప్రతీక్ సిన్హా ఆరోపించారు.
2020లో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించేందుకు పిలిచారు. ఆ కేసులో ఆయన్ని అరెస్టు చేయొద్దని కోర్టు సైతం రక్షణ ఇచ్చింది. అయితే తీరా అక్కడికి వెళ్లాక పోలీసులు కొత్త కేసును తెరమీదకు తీసుకొచ్చారు. పైగా అది నాలుగేండ్ల కిందటిది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జుబైర్‌ను అరెస్టు చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మోడీ సర్కార్ తీరుపై వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.