Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సామాజిక ముసుగులో నుంచి దేశ సహజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ విమర్శించారు. బెంగుళూరులో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం సమావేశాలకు ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ గతంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి దళితుడని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు ఇచ్చిందని అన్నారు. దీని వల్ల నష్ట పోయేది సామాజిక తరగతులేనని తెలిపారు. ఇప్పుడు గిరిజన రాష్ట్రపతి పేరు చెప్పి అడవి పుత్రుల సహజ సంపదను అంతా అదానీ, అంబానీలుకు అప్పగించాలని చూస్తుందన్నారు. బీజేపీ పరిభాషలో సామాజిక న్యాయమంటే, దేశ సంపదను కొల్లగొట్టి బడా కార్పొరేట్లకు ఇవ్వడమేనని అన్నారు. సామాజిక తరగతులలో వ్యక్తులను ముందు పెట్టి వ్యవసాయ కార్మికులను భ్రమలు కలిగించడమనేది మోసం, దగా తప్ప మరొకటి కాదని అన్నారు. ఇల్లు, కనీస వేతనాలు, ఉపాధి, ఆహార భద్రత, విద్యా వైద్య సమస్యలు పేదలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం, ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో మోడీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. ఆహార భద్రతలో 119 స్థానానికి పడిపోయిందని అన్నారు. పౌరహక్కులు, మానవ హక్కులు దేశ ప్రతిష్ట దిగజారి పోయిందని పేర్కొన్నారు. వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్యంగా చేస్తున్న ఆందోళన ప్రచారానికి రైతు, కార్మిక ఇతర ప్రజా సంఘాలు అన్ని మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సమావేశంలో అఖిల భారత ఉపాధ్యక్షుడు నిత్యానంద స్వామి పాల్గొన్నారు.