Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 30కల్లా ఖాళీ చేయాలని వర్సిటీ యాజమాన్యం ఆదేశం
- క్యాంపస్‌కు ఇదే ముఖ్యకేంద్రం.. మూసివేత తగదు : విద్యార్థులు, టీచర్లు
న్యూఢిల్లీ : ప్రఖ్యాత వర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థుల క్యాంపస్ జీవితాలకు ప్రధాన కేంద్రమైన దాభాలను మూసివేయాలని వర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. వర్సిటీ ఆవరణలో వాటి నిర్వహణ ఆపేయాలని, జూన్ 30 (నేటితో) నాటికల్లా ఇక్కడి పరిసరాల్ని ఖాళీచేసి వెళ్లిపోవాలని జేఎన్‌యూ సంయుక్త రిజిస్ట్రార్ ఎం.కె.పచౌరీ ఆదేశాలు జారీచేశారు. దాంతో దాభాలు, టిఫిన్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు, ఫొటోషాప్ నిర్వాహకులు హఠాత్తుగా అక్కడ్నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్సిటీ క్యాంపస్‌లోని వేలాది మంది విద్యార్థులకు ఇక్కడి దుకాణాల ద్వారా అనేక అవసరాలు తీరుతున్నాయి. ముఖ్యంగా క్యాంపస్‌లో విద్యార్థుల జీవితానికి, ఇక్కడి దుకాణాలకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. వర్సిటీ తాజా ఆదేశాల్ని విద్యార్థులు, టీచర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వర్సిటీ ఆవరణ నుంచి వాటిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
టెండర్ ప్రక్రియ చేపట్టకుండా ఆయా దుకాణాల్ని ఇక్కడ కొనసాగిస్తున్నారని నోటీసులో సంయుక్త రిజిస్ట్రార్ ఎం.కె.పచౌరీ తెలిపారు. ప్రభుత్వ ఆవరణ చట్టం, 1971 ప్రకారం నోటీసులు జారీచేశామన్నారు. ఈ అంశంపై వర్సిటీ కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఈ నోటీసుపై దాభాలు, టిఫిన్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు నడుపుతున్న చిన్న చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయామని, ఇప్పుడు తమ పొట్ట కొట్టవద్దని వారు వేడుకుంటున్నారు.
టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ..''దీనిపై ఆధారపడి ఎన్నో ఏండ్లుగా జీవిస్తున్నా. ఈ ప్రదేశాన్ని తాత్కాలికంగా గతంలో వర్సిటీ యాజమాన్యం కేటాయించింది. ఇప్పుడు హఠాత్తుగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. జూన్ 30లోపు రూ.20లక్షలు కట్టాలని బిల్లు చేతిలో పెట్టారు. గతంలో వర్సిటీ అధికారులు టెండర్ ప్రక్రియ చేపట్టకపోతే, అందుకు మేం మూల్యం చెల్లించాలా? నా జీవనోపాధిని కోల్పోవాల్సినంత తప్పేం చేశా?''నని ఆవేదన వ్యక్తం చేశాడు.
తక్కువ ధరలో మంచి ఆహారం : టీచర్లు, విద్యార్థులు
వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. దాభాలు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లను ఖాళీ చేయించటాన్ని వ్యతిరేకిస్తున్నామని టీచర్లు, విద్యార్థులు మీడియాకు తెలిపారు. గతంలో ఇలాగే క్యాంపస్ ఆవరణలో నెస్కఫె క్యాంటిన్ ఏర్పాటుచేస్తామని ముందుకువచ్చింది. విద్యార్థులు భరించలేని స్థాయిలో ధరలు పెట్టింది. ఆహార పదార్థాల నాణ్యత చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయోగం చేస్తున్నారు. ఉన్నటువంటి దాభాల్ని, టిఫిన్ సెంటర్లను మూసేసి, వేరేవాటిని తీసుకొస్తారట. చాలా తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దాభాల్ని ఖాళీ చేయించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు.