Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఏపీఏ కింద కేసు నమోదు
- ఇరువురు అరెస్టు, సిట్ ఏర్పాటు
- ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించేందుకేనన్న కేంద్రం
- మతోన్మాదం ఏ రూపంలో వున్నా ఖండించాలి : కేరళ, బెంగాల్ సీఎంలు
- నిందితులపై తక్షణమే చర్యలు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో ఇరువురు వ్యక్తులు దర్జీ కన్నయ్య లాల్‌ను దారుణంగా హత్య చేసిన సంఘటనలో నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయోత్పాతాలు సృష్టించాలన్నది ఆ దుండగుల ఆలోచనగా వుందని ఎన్ఐఏ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఎన్ఐఏ బృందాలు ఉదరుపూర్ చేరుకున్నాయి. త్వరితగతిన దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాయని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. పైగా హత్య చేసిన తీరునంతా వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారనీ, ఈ హత్యకు బాధ్యత తమదేనని ప్రకటిస్తూ, ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ప్రయత్నించారని ఆ ప్రతినిధి పేర్కొన్నారు. ఇస్లామ్‌ను అవమానపరిచినందుకే ఈ ప్రతీకారమని ప్రకటిస్తూ, పదునైన ఆయుధాలతో బాధితుడిని పలు చోట్ల తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. కాగా, ఐపీసీలోని వివిధ సెక్షన్లు, యూఏపీఏ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని రియాజ్ అక్తారి, గౌస్ మహ్మద్‌లుగా గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే రాజస్థాన్ పోలీసులు కేసు దర్యాప్తుకై సిట్ ఏర్పాటు చేశారు. అయితే, కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఇక కేసు తదుపరి దర్యాప్తును ఎన్ఐఏ చేపడుతుందనీ, ఆ దర్యాప్తుకు రాష్ట్ర ఏటీఎస్ పూర్తిగా సహకరిస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాడికల్ శక్తుల ప్రమేయం లేకుండా ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. దేశంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయనీ, హిందూ, ముస్లింలు ఇరువురూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఈ తరుణంలో ప్రధాని దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని కోరారు.
మంగళవారం రాత్రి హత్య జరిగిన వెంటనే పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదరుపూర్‌లోని ధన్మాండి పోలీసుస్టేషన్లో తొలుత కేసు నమోదైంది. హత్య జరిగిన వెంటనే అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభింపచేశారు. ఉదరుపూర్ చుట్టుపక్కల గల ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. కాగా, దారుణంగా హత్యకు గురైన కన్నయ్య లాల్ అంత్యక్రియలను బుధవారం అత్యంత పకడ్బందీగా చేపట్టిన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. వందలాదిమంది స్థానికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అంతకుముందు, దర్జీ హత్యను తీవ్రవాద సంఘటనగా కేంద్రం అభివర్ణించింది. ఈ దారుణ హత్యపై కూలంకషంగా దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఎన్ఐఏను ఆదేశించింది. ఈ హత్య వెనుక ఏ సంస్థ వుంది, అంతర్జాతీయంగా సంబంధాలు వున్నాయా లేదా అన్నది దర్యాప్తులో తేల్చాల్సిందిగా కోరింది. కాగా, నిషేధిత తీవ్రవాద గ్రూపు ఐసిస్ భావజాలంతో ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభావితమైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. విదేశాలతో హంతకులకు సంబంధాలున్నట్లు తెలిసిందని ముఖ్యమంత్రి గెహ్లాట్ చెప్పారు. నిందితుల్లో ఒకడైన గౌస్ మహ్మద్‌కు కరాచీ కేంద్రంగా గల ఇస్లామిస్ట్ సంస్థతో సంబంధాలున్నట్టు తెలిసిందని రాజస్థాన్ డీజీపీ చెప్పారు. 2014లో కరాచీ కూడా వెళ్ళాడని చెప్పారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఆటవిక చర్య : కేరళ, బెంగాల్ సీఎంల ఖండన
దర్జీ హత్యను ఆటవికమైనదిగా అభివర్ణిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తీవ్రంగా ఖండించారు. హింస, తీవ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో జరిగినా ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు పెరుగుతున్న మతోన్మాదమేనని పినరయి విజయన్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇస్లామిక్ తీవ్రవాదం, హిందూత్వ తీవ్రవాదం ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి వున్నాయో దీన్ని బట్టి తెలుస్తోందని అన్నారు. ఏ మతం పేరుతోనైనా మతోన్మాదాన్ని సహించకూడదని ప్రతి ఒక్కరూ తీర్మానించుకోవాల్సిన సమయమిదని అన్నారు. ఒక తరహా మతోన్మాద చర్యలకు మరో తరహాలో మతోన్మాద చర్యలు సమాధానం కారాదనీ, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వాస్తవమని అన్నారు. మత విశ్వాసాలకు అతీతంగా అందరూ ఐక్యంగా నిలబడాలని కోరారు. లౌకికవాద విలువలను విశ్వసించేవారే కాదు, మత సంస్థలు కూడా ఈ దారుణ చర్యను ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
సీపీఐ(ఎం) ఖండన
ఉదరుపూర్‌లో జరిగిన దారుణ, ఆటవిక చర్యను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ కిరాతకానికి పాల్పడిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజలు శాంతియుతంగా వుండాల్సిందిగా కోరింది.
మృతుడిపై గతంలో కేసు
మృతుడు కన్నయ్య లాల్‌పై గతంలో కేసు నమోదైందని శాంతి భద్రతల అదనపు డిజి హవా సింగ్ గుమేరియా ధ్రువీకరించారు. జూన్ 10న సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు లాల్‌పై కేసు నమోదైందని చెప్పారు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత లాల్ తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయంటూ తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో పోస్టు తాను పంపింది కాదని, తన కుమారుడు పొరపాటున పంపాడని చెప్పాడు. కొంతమంది వ్యక్తులు తరచూ తన దుకాణానికి వస్తూ షాప్‌ను తెరవనివ్వకుండా తనను బెదిరిస్తున్నారని చెప్పాడు. అయితే పోలీసుల జోక్యంతో ఇరు వర్గాలను పిలిపించి రాజీ కుదిర్చి పంపారు.