Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి, యువజన సంఘాలు ధర్నా
- దేశ భద్రతకు ముప్పు : డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు ఎఎ రహీమ్
న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎ, ఆర్వైఎఫ్, పీఎస్యూ, ఏఐవైఎల్, ఏఐఎస్బీ, ఏఐడీవైఓ, ఏఐడీఎస్ఓ, ఆర్వైఏ సహా ఇతర ప్రగతి శీల విద్యార్థి, యువజన సంఘాలకు చెందిన యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ, డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎ ఎ రహీమ్ మాట్లాడుతూ అగ్నిపథ్ పథకం దేశ యువతకు పెనుముప్పును తెచ్చిపెడుతుందని విమర్శించారు. సాయుధ దళాలలో ప్రధాన భాగాన్ని కాంట్రాక్టీకరణ చేయడమే అగ్నిపథ్ ప్రధాన లక్ష్యమని ఆయన విమర్శించారు. ఇది ఉపాధిని కోల్పోవడమే కాకుండా దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. ఈ కారణాల వల్లనే దేశవ్యాప్తంగా యువత నిరసనకు దిగిందని గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోవడమే కాకుండా సాయుధ దళాలలో పెండింగ్లో ఉన్న ఖాళీలను అత్యవసర ప్రాతిపదికన రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను కూడా సకాలంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ, ఉద్యోగుల తొలగింపుల వైపు ప్రభుత్వం నిరంతరాయంగా ముందుకు సాగడం మానుకోవాలని హితవు పలికారు. దేశంలోని యువతకు శాశ్వతమైన, గౌరవంతో కూడిన ఉపాధికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా, యువతకు ఉపాధి కోసం డీవైఎఫ్ఐ పోరాటాలు కొనసాగుతాయనీ, అగ్నిపథ్కి వ్యతిరేకంగా పోరాటం దేశమంతటా ఐక్య ఉద్యమంలా సాగాలని సూచించారు. డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమగరాజ్ భట్టాచార్య మాట్లాడుతూ 2014లో అధికారంలోకి రాకముందు బీజేపీ, నరేంద్ర మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు.