Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు నామినేషన్ల పరిశీలన
- రెండు తప్ప అన్ని తిరస్కరణే..!
న్యూఢిల్లీ : భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంటుంది. రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు మొత్తం 79 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేశారు. బుధవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. దీంతో నేడు (గురువారం) అభ్యర్థుల దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలించనున్నారు. 79 నామినేషన్లలో అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన నామినేషన్లు తప్ప, మిగిలిన వారు దాఖలు చేసిన నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. ఎందుకంటే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు 50 మంది ఓటర్లు (ఎంపీ, ఎమ్మెల్యేలు) ప్రతిపాదించాలి, 50 మంది ఓటర్లు (ఎంపీ, ఎమ్మెల్యేలు) బలపరచాలి. కనుక మిగిలిన అభ్యర్థులెవ్వరికీ వంద మంది ఓటర్లు మద్దతు లేదు. అందువల్ల ఆయా నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయి. నేడు నామినేషన్ల పరిశీలించగా, నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే జులై 2 వరకు గడువు ఉంది. పోలింగ్ జులై 18న జరుగుతుంది. జులై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది. అందకు ముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజశేఖర్ లు నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని సేలం నుంచి 'ఎలక్షన్ కింగ్' కె పద్మరాజన్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. అత్యంత విఫలమైన అభ్యర్థిగా పద్మరాజన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. హౌమియోపతి వైద్యుడైన పద్మరాజన్ 231 ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కదానిలో కూడా విజయం సాధించలేకపో యారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దయాశంకర్ అగర్వాల్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ప్రమాద బాధితులకు సహాయం చేసే మరో అభ్యర్థి సూరజ్ ప్రకాష్ దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నుకోబడాలనే ఆశతో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ యాదవ్ అనే రైతు నామినేషన్ దాఖలు చేశారు. తాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రామం పక్కనే నివసిస్తున్నానని, 10 రాష్ట్రాల ఎంపీలు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడానికి అంగీకరించారని ఆ రైతు తెలిపారు. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 106 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.