Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్టు ఈసీ తెలిపింది. దీనికి సంబంధించి జూలై 5న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు జులై 19 గడువు నిర్ణయించింది. జులై 20న నామినేషన్లను పరిశీలించనున్నారు. జులై 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించారు. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారం పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఆయన పదవీకాలం ముగిసేలోపు ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే సమావేశమై, ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసి వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీ
ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో 233 మంది రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, 12 మంది రాజ్యసభకు నామినేట్ అయిన సభ్యులు, 543 మంది లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. మొత్తం 788 మంది సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. ఎలక్టోరల్ కాలేజీలో ఒక్కో సభ్యుని ఓటు విలువ 708గా ఉంది. మొత్తం 788 మంది సభ్యుల ఓటు విలువ 5,57,904గా ఉంది.
రహస్య బ్యాలెట్ ఓటింగ్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ పార్లమెంట్ హౌస్‌లోని మొదటి అంతస్తులో రూం నెంబర్ 63లో జరుగుతుంది. ఓటింగ్ కూడా రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఈ విధానంలో ఓటర్లు అభ్యర్థుల పేర్లపై ప్రాధాన్యతలను ఇవ్వాలి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతో మాత్రమే ఓటు వేయాలి. తప్ప మరే ఇతర పెన్నుతో వేయకూడదు. ఏదైనా ఇతర పెన్ను ఉపయోగిస్తే, ఆ ఓటు చెల్లుబాటు అవ్వదు. కౌంటింగ్ సమయంలో ఆ ఓటు తిరస్కరించబడుతుంది. అలాగే రహస్య ఓటింగ్ కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ బ్యాలెట్ చూపించడం పూర్తిగా నిషేధించబడింది. ఒకవేళ ఎవరైనా బ్యాలెట్‌ను చూపిస్తే, ఆ ఓటు రద్దు చేయబడుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో రాజకీయ పార్టీలు తమ ఎంపీలకు ఎలాంటి విప్ జారీ చేయకూదని ఈసి పేర్కొంది. లోక్‌సభ సెక్రెటరీ జనరల్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. రిటర్నింగ్ అధికారికి సహాయంగా పార్లమెంటరీ హౌస్ (లోక్‌సభ)లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమిం చాలని కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కరోనా ప్రోటోకాల్ తప్పని సరిగా అమలు చేయాలని సూచించింది. అభ్యర్థి నామినేషన్ పత్రంపై 20 మంది ఓటర్లు ప్రతిపాదకులుగా, మరో 20 మంది మంది ఓటర్లు బలపరిచేవారు సంతకం చేయాలి. అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలి. ఎన్నికల సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.15,000 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని నామినేషన్ పత్రంతో పాటు అందజేయాల్సి ఉంటుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్
నోటిఫికేషన్ జారీ జులై 5 (మంగళవారం)
నామినేషన్ల దాఖలకు గడువు జులై 19 (మంగళవారం)
నామినేషన్ల పరిశీలన జులై 20 (బుధవారం)
నామినేషన్ల ఉపసంహరణకు గడువు జులై 22 (శుక్రవారం)
పోలింగ్ జులై 6 (శనివారం)
పోలింగ్ గంటలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
ఓట్ల లెక్కింపు జులై 6 (శనివారం)