Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలపరీక్షకు ముందే తప్పుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి
- ప్రజాస్వామ్య సమస్యల పరిష్కారానికి అసెంబ్లీనే వేదిక: సుప్రీం కోర్టు
ముంబయి: అసెంబ్లీలో బలపరీక్షకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తప్పుకున్నారు. బలపరీక్షకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికి ఆయన రాజీనామాను ప్రకటించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నట్టు వెల్లడించారు. తనకు సహకరించిన సోనియాగాంధీ, శరద్‌పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగలిందని, సొంత పార్టీ వాళ్లే మమ్మల్ని మోసం చేశారని ఉద్ధవ్ పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఏమన్నది..?
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ఎంవిపి ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొనాల్సిందేనని, తన మెజారిటీని నిరూపించుకోవాల్సిందేనని సుప్రీం కోర్టు బుధవారం పేర్కొంది. గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ, శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు వేసిన పిటిషన్‌పై బుధవారం సుదీర్ఘంగా వాద ప్రతివాదనలు కొనసాగాయి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీ వేదికే ఏకైక మార్గమని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రెబెల్ సేన నేత ఏక్నాథ్ షిండే తరపున సీనియర్ న్యాయవాది కిషన్ కౌల్ మాట్లాడుతూ, బలపరీక్షను ఎన్నడూ వాయిదా వేయలేమని అన్నారు. సభ్యుల బేరసారాలు జరగకుండా నివారించేందుకు, రాజకీయ జవాబుదారీతనాన్ని నిర్ధారించేందుకు ఇదొక్కటే మార్గమని అన్నారు. శివసేన తరపు న్యాయవాది అభిషేన్ మనుసింఘ్వి మాట్లాడుతూ ఈ బలపరీక్ష ఆదేశాలు అన్యాయమని, అపవిత్రమని వ్యాఖ్యానించారు. అనవసరమైన తొందరపాటుతో తీసుకుంటున్న చర్యలని అన్నారు. ఎంఎల్ఎల అనర్హతపై ఏమీ తేల్చకుండా బలపరీక్ష ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గురువారం బలపరీక్ష జరగకపోతే మునిగిపోయేదేమీ లేదన్నారు. పార్టీ మారిన వ్యక్తులు ప్రజల అభీష్టానికి ప్రాతినిధ్యం వహించలేరని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎన్‌సిపి సభ్యులు కోవిడ్‌తో బాధపడుతున్నారని, మరో కాంగ్రెస్ ఎంఎల్ఎ విదేశాల్లో వున్నారని ఈ పరిస్థితుల్లో బల పరీక్ష నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కలవగానే పరిస్థితి ఏమిటో తెలుసుకోకుండా, గవర్నర్ బలపరీక్షకు ఎలా ఆదేశించారని ప్రశ్నించారు.మహారాష్ట్రలో బుధవారం రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారుతూ వచ్చాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎంఎల్ఎల తిరుగుబాటు నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడిందని పేర్కొంటూ, గురువారం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా తొలుత మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఆదేశించారు. దీనిపై పాలక సంకీర్ణం మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మరోవైపు గువహటిలో మకాం వేసిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసమ్మతి ఎంఎల్ఎలు అవసరమైతే ముంబయి రావడానికి సిద్ధంగా వున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు గురువారం జరిగే బలపరీక్షలో పాల్గొనేందుకు తమను అనుమతించాల్సిందిగా జైల్లో వున్న ఎన్ సీపీ నేతలు నవాబ్ మాలిక్, అనీల్ దేశ్‌ముఖ్ బుధవారం సుప్రీంను ఆశ్రయించారు.
మంత్రివర్గ కీలక నిర్ణయాలు
ఒకవైపు ప్రభుత్వ మనుగడపై తీవ్రంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దానితో సంబంధం లేకుండా థాకరే ప్రభుత్వం బుధవారం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. శివసేన సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నట్లుగా ఔరంగాబాద్ పేరును శంభాజినగర్గా, ఉస్మానాబాద్ పేరును ధరాశివ్‌గా మార్చే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. హిందూత్వ భావజాలమే ప్రధానంగా పనిచేసే శివసేన నెమ్మదిగా ఆ సిద్ధాంతాలకు దూరం జరుగుతోందని, లౌకికవాద పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సిపిల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే ఈ రకంగా వ్యవహరిస్తోందని రెబల్ ఎంఎల్ఎలు పేర్కొంటున్నారు. ఆ నేపథ్యంలో హడావిడిగా సమావేశమైన మహారాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయాలు తీసుకుంది. నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాయఘడ్, థానే జిల్లాల్లోని ప్రాజెక్టు బాధితుల నేత అయిన డిబి పటేల్ విమానాశ్రయంగా మార్చేందుకు కూడా ఆమోదం తెలిపింది.