Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెచ్ఐవీ రోగులకు ప్రాణసంకటం
- రాష్ట్రాల వద్ద సరిపడా లేని నిల్వలు
- 'డోలుటెగ్రావిర్' లభించకపోవటంతో వెనుదిరుగుతున్న రోగులు
- మోడీ సర్కారుపై వైద్య నిపుణులు, సామాజికవేత్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : ప్రాణాంతంక ఎయిడ్స్ మహమ్మారితో పోరాడుతున్న హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వారికి సరిపడా ఔషధాలను అందించటంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో రాష్ట్రాల వద్ద సరిపడా స్టాక్ లేకపోవటంతో దాని ప్రభావం రోగులపై పడుతున్నది. కేంద్రం వైఫల్యం కారణంగా లక్షలాది మంది రోగులు అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారని వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. మందుల కొరత హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో అనవసర ఆందోళనలను తీసుకొస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 'డోలుటెగ్రావిర్' 2020లో భారత్‌లో ప్రవేశపెట్టిన తర్వాత వేలాది మంది హెచ్ఐవీ రోగులకు ఆశాకిరణంగా కనిపించింది. కొంత మంది వైద్యులు దీనిని 'మిరాకిల్ డ్రగ్'గా ప్రశంసించారు. దీంతో హెచ్ఐవీ రోగులు యాంటిరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)కి మారారు. ఇది వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక కణాల పెరుగుదలను వృద్ధి చేస్తుంది. అలాగే వైరల్ లోడ్‌ను తగ్గించటంలో ఇది సహాయపడుతుంది.
మందులు అందని వైనం
దేశవ్యాప్తంగా డోలుటెగ్రావిర్ కొతర కారణంగా రోగులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 2020లో నితిన్ సోలంకి (పేరు మార్చాం) డోలుటెగ్రావిర్ తీసుకోవటం ప్రారంభించాడు. వెంటనే దాని ప్రయోజనాలూ అనుభవించాడు. కానీ, మందుల కొరత కారణంగా సోలంకి ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేకపోవటంతో గత రెండు నెలలుగా పరిస్థితి సంక్లిష్టంగా తయారైంది. ఆయన మహారాష్ట్రలోని థానేలోని స్థానిక యాంటీ రెట్రో వైరల్ కేంద్రాన్ని సందర్శిస్తున్నాడు. డోలుటెగ్రావిర్ నిల్వ లేనందున ఖాళీ చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. '' ఔషధం కోసం నేను అధికారులతోనూ పోరాడాను. హెచ్ఐవీ విషయంలో ప్రభుత్వం ప్రచారాలు నిర్వహించింది. మాకు (హెచ్ఐవీ రోగులకు) చికిత్స అందిస్తామని వాగ్దానం చేసింది. అది ఇప్పుడు ఎక్కడ ఉన్నది?'' అని సోలంకి ప్రశ్నించాడు. సోలంకికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. ఆర్ట్ కేంద్రాల వద్ద ఉచితంగా పంపిణీ చేసే మందుల పైనే ఆయన ఆధారపడుతున్నాడు. ఈ ట్రీట్మెంట్ కేంద్రాలు సాధారణంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (న్యాకో) నుంచి వాటి సప్లరులను పొందుతాయి.
తమిళనాడులోనూ..
తమిళనాడులోనూ ఇదే ఇబ్బంది నెలకొని ఉన్నది. ఇక్కడ టెనోఫొవిర్ డిసోప్రొక్సిల్, లామివుడిన్, డోలుటెగ్రావిర్, అబాకావిర్, లోపినావిర్ వంటి యాంటీ రెట్రో వైరల్ ఔషధాల కొరత ఉన్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఏఆర్టీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఒకటి నుంచి మూడు నెలలు కాకుండా కేవలం 15 రోజులకు మందులు పంపిణీ చేస్తుండటం గమనార్హం. ''జాతీయ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి ఏఆర్టీ కేంద్రం మూడు నెలలకు అవసరమైన స్టాక్‌ను నిర్వహించాలి. అబాకావిర్, లోపినావిర్ కొరత ఉన్నది'' అని అధికారులు వెల్లడించారు.