Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం
- శివసైనికులు, కార్యకర్తలు ఎదురు తిరగకుండా బీజేపీ ప్రయత్నాలు!
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో తొమ్మిది రోజులుగా సాగిన తీవ్ర రాజకీయ సంక్షోభం గురువారం తెరపడింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగడంతో బుధవారం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దాంతో 2019లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ఏర్పాటుచేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దాంతో గురువారం బీజేపీ, శివసేన రెబల్ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేశారు. గురువారం మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ రాజీనామాతో తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని, శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం సాగింది. అయితే గురువారం సాయంత్రం అనూహ్యంగా ఏక్నాథ్ షిండే సీఎం అవుతున్నారని తెలిసింది. తాను సీఎం పదవి చేపట్టడం లేదని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండబోనని ఫడ్నవీస్ ప్రకటించారు. అయితే ఫడ్నవీస్ అలా ప్రకటించిన మూడు గంటల వ్యవధిలోనే బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫడ్నవీస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగం కావాలని, ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదేశించారట. దాంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని వార్తలు వెలువడ్డాయి.
మరో చీలిక రాకుండా!
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి తెరవెనుక సూత్రధారి బీజేపీ అన్నది అందరికీ తెలిసిందే! సీఎం పదవి కచ్చితంగా బీజేపీకే వెళ్తుందని అందరూ అంచనావేశారు. అధికారం కోసం శివసేనను చీల్చారన్న అపవాదుకు భయపడి చివరి క్షణంలో సీఎం పదవి రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ వదిలేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎవరూ చెదిరిపోకుండా, జారీపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు జరిగిందని తెలుస్తోంది. ఏదేమైనా సీఎంగా షిండే పూర్తిగా బీజేపీపై ఆధారపడాల్సిందే. తెరవెనుకగా రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతిలో ఉందన్నది బహిరంగ రహస్యం.అంతేగాక శివసేనకు ముంబయి, కొంకణ్, థానె, మరట్వాడా ప్రాంతాల్లో రాజకీయగా పట్టుంది. కార్యకర్తల బలం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు రెండేండ్లు మాత్రమే కాబట్టి, కిందిస్థాయి కార్యకర్తలు ఉద్ధవ్ ఠాక్రే వెంట ఉంటే..రాబోయే ఎన్నికల్లో తమకు ఎదురు తిరుగుతారనే భయం బీజేపీని వెంటాడుతోంది. అలాగే తటస్థ ఓటర్లు శివసేన వైపునకు మొగ్గే అవకాశమూ ఉంది. అదేగనుక జరిగితే ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ పుంజుకుంటారని బీజేపీ అధిష్టానం అంచనావేసింది.