Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీఫ్ సీజన్ కోసం 3.5లక్షల టన్నులు దిగుమతి
- ఇతర దేశాలకన్నా తక్కువ ధరలో భారత్కు సరఫరా
న్యూఢిల్లీ : మనదేశ అవసరాల్లో ఇంధనం తర్వాత అత్యంత ముఖ్యమైంది ఎరువులు. దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలవ్వటంతో ఎరువులకు డిమాండ్ పెరుగుతోంది. భారత్ ప్రతిఏటా అంతర్జాతీయ మార్కెట్లో డై అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ)ని కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఈసారి మిత్రదేశం రష్యా అంతర్జాతీయ ధరలకన్నా తక్కువలో డీఏపీని భారత్కు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈనేపథ్యంలో జులైలో భారత్కు రష్యా నుంచి 3.5లక్షల టన్నుల డీఏపీ దిగుమతి కాబోతోంది. ఉక్రెయిన్ సంక్షోభ సమయాన రష్యా నుంచి దిగుమతులు ఆపేయాలని ఓ వైపు అమెరికా ఇతర దేశాలపై పెద్దఎత్తున ఒత్తిడి చేస్తోంది. అయినప్పటికీ భారత్కు చెందిన ఇండియన్ పొటాష్, రాష్ట్రీయ కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఛంబాల్ ఫెర్టిలైజర్స్, కృషాక్ భారతీ కోఆపరేటివ్ సంస్థలు టన్ను డీఏపీని 920-925 డాలర్ల (సుమారుగా రూ.73వేలు) వద్ద రష్యాతో కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి.
భారత్తో బలమైన స్నేహ సంబంధాల్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలో డీఏపీ సరఫరాకు రష్యా అంగీకరించిందని సమాచారం. చైనా, సౌదీ అరేబియా, మొరాకో, జోర్డాన్లు కూడా ఇటీవల రష్యా నుంచి డీఏపీ దిగుమతి చేసుకున్నాయి. ఆ దేశాలకు అమ్మిన ధరకన్నా తక్కువలో భారత్కు డీఏపీ సరఫరా చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టన్ను డీఏపీ 1030 డాలర్ల (రూ.82వేలు) ధర వద్ద బంగ్లాదేశ్ వార్షిక టెండర్ దాఖలుచేసింది. ఇండోనేసియా, థాయిలాండ్లు టన్ను డీఏపీ 1000 డాలర్ల (రూ.79వేలు) వద్ద రష్యా నుంచి కొనుగోలు చేశాయి.