Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణకు మోడీ ప్రభుత్వం కసరత్తు
- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు యోచన
దేశంలో ప్రభుత్వరంగ సంస్థల్ని హౌల్‌సేల్ గా అమ్మేస్తున్న మోడీ సర్కార్ కన్ను ఇపుడు ప్రభుత్వరంగంలో ఉన్న బ్యాంకులపై పడింది.ఇప్పటికే ఉన్న జాతీయ బ్యాంకులను విలీనం చేసి రెండంకెలకు కుదించేసింది.తాజాగా ఆ బ్యాంకుల నిర్వహణ బాధ్యతలనుంచి బీజేపీ ప్రభుత్వం తప్పుకోవాలనుకుంటోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరించేలా బిల్లు ప్రవేశపెట్టడానికి యత్నిస్తోందని తెలిసింది.
న్యూఢిల్లీ : దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయి వేటీకరణ వంద శాతం కానున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే త్వరలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తన పూర్తి వాటాను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఎయిర్ ఇండియా ను ప్రయివేటీకరించబడింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో 3.5 శాతం వాటాను విక్రయించారు. ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వంద శాతం వాటాను ప్రయివేట్ సంస్థలకు విక్రయించడానికి, అనుమతించడానికి ప్రభుత్వం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం, బదిలీ) )చట్టం-1970కి సవరణను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి పూర్తిగా వైదొలగేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి.
ప్రభుత్వవాటా తగ్గించాలని కేంద్రం ఆలోచన..
బ్యాంకింగ్ చట్టం ప్రకారం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలి. ముందుగా ఈ వాటాను 26 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే బిల్లును ప్రవేశపెడితే, అటువంటి బ్యాంకుల్లో 0 శాతం వాటాను కలిగి ఉండడాన్ని ఆమోదించవచ్చు. ఇటీవల, ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయానికి సంబంధించిన చర్చలు చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లను కూడా ప్రయివేటీకరణ చేసే వాటిల్లో ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంకుల యాజమాన్య సమస్యలపై చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుత సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థను ప్రయివేటీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ బిల్లును ముందుగా 2021లో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనికి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2021 అని పేరు పెట్టారు. అయితే, దీనిని ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు వంద శాతం బ్యాంకులను ప్రయివేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు కసరత్తు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.