Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ఉదరుపూర్ ఘటనకు ఆమే బాధ్యురాలు
- ఆమెపై ఎన్నో ఎఫ్ఐఆర్లు..అయినా ఎందుకు చర్యల్లేవ్?
- తనకు ముప్పు ఉందంటూ...దేశ భద్రతకే ముప్పు తెచ్చారు! ొ టీవీ యాజమాన్యానిదీ తప్పే..
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశానికే తలవంపులు తీసుకొచ్చిన నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసిందని సుప్రీం అబిప్ర్రాయపడింది. ఆమె చేసిన వ్యాఖ్యల వల్లే ఉదరుపూర్ ఘటన జరిగిందని తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి అయినంత మాత్రానా ఆందోళన కలిగించే విషయాలు మాట్లాడే లైసెన్సు ఎవరికీ ఇవ్వరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా వ్యాఖ్యలు చేసే వారు ఏ మతాన్ని గౌరవించరని, రెచ్చగొట్టేలా ప్రకటనలు మాత్రమే చేస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నుపుర్ శర్మపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులన్నింటినీ దర్యాప్తు కోసం ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నూపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్డీవాలాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో పెను వివాదానికి దారితీసిన నుపుర్ శర్మ వ్యవహారంపై ధర్మాసనం తీవ్ర స్థాయిలో మండిపడింది. ''ఆమె నోటి దురుసు.. దేశం మొత్తంలో మంటపెట్టింది. రావణ కాష్టాన్ని రగిల్చింది. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప.. టీవీ ఛానెల్, నూపుర్ శర్మల చర్చ వల్ల ఒరిగింది ఏమిటి? అని ప్రశ్నించింది.
ఆమెదే బాధ్యత
''దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెనే బాధ్యత వహించాలి. బీజేపీకి ఒక అధికార ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టానుసారం మాట్లాడవచ్చా? మీ ఇష్టం వచ్చింది మాట్లాడకూడదు కదా! మీ స్థాయిలో ఉన్న రాజకీయవేత్త అన్ని మతాలనూ, కులాలనూ గౌరవించాలి. ముహమ్మద్ ప్రవక్తపై మీరు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాం. చీప్ పబ్లిసిటీ, పేరు మోసిన పొలిటికల్ ఎజెండాతో ఈ ప్రకటనలు చేస్తారా? ఇలాంటి ప్రకటనల అవసరం ఏముంది?'' అని ధర్మాసనం ప్రశ్నించింది.
దేశ భద్రతకు ముప్పు
''ఆమెకు ముప్పా ? దేశ భద్రతకు ముప్పుగా ఆమె మారారా ? టీవీలో జరిగిన చర్చను మేం చూశాం. మీరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. నుపుర్ శర్మ చేసిన ప్రకటనలు ఆమె అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి'' అని ధర్మాసనం పేర్కొంది. నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల చర్చను హోస్ట్ చేసిన టీవీ ఛానల్‌పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ''టీవీ చర్చ దేనికి? కేవలం ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసమేనా? కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు తెలియజేయాలి. దేశంలో ఏం జరిగినా చర్చ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి'' అని ప్రశ్నించింది.
పొగరు తలకెక్కే ఆ వ్యాఖ్యలు
అధికారం వెనక ఉంది కదా అని ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారని ధర్మాసనం పేర్కొంది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
యాంకర్ అడిగిన ప్రశ్నలకే నుపుర్ సమాధానం ఇచ్చారని ఆమె తరపు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ తెలిపారు. అలాగైతే యాంకర్‌పై నుపుర్ శర్మ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. టెలివిజన్‌లో ప్రకటనలు చేస్తూ దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించే రాజకీయ ప్రతినిధి స్వేచ్ఛతో జర్నలిస్టు స్వేచ్ఛను పోల్చలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆమె వల్ల దేశం రగిలిపోతోంది
విచారణ సందర్భంగా ఉదరుపూర్‌లో జరిగిన హత్య గురించి ధర్మాసనం ప్రస్తావిస్తూ.. పరిణామాల గురించి ఆలోచించకుండా నుపుర్ శర్మ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఆమెలోని అహంకారం పిటిషన్లో కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనికి ఆమె తరపున సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ సమాధానమిస్తూ.. ప్రవక్త వ్యాఖ్యలపై ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. అయితే.. ఆమె టీవీ (మీడియా ద్వారా) ముందరకే వచ్చి యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉందని, వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడంలో చాలా ఆలస్యం అయ్యిందని ధర్మాసనం తెలిపింది.
మెజిస్ట్రేట్ల ముందు హాజరు కావల్సిందే
ఫిర్యాదు నమోదు అయిన తర్వాత ఢిల్లీ పోలీసులు ఏం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. ''నుపుర్ శర్మ ఫిర్యాదు చేస్తే, ఆ కేసుల్లో వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేశారు. కానీ నుపుర్‌పై ఎన్నో ఎఫ్ఐఆర్లు నమోదైన ఆమెను అరెస్టు చేయలేదు. ఎందుకు ఆమెను టచ్ చేయలేకపోయారు. అదే ఆమె పలుకుబడిని సూచిస్తోంది'' అని ఢిల్లీ పోలీసులను ధర్మాసనం ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆరెస్టు కాకపోవడంతోనే ఆమె బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని వ్యాఖ్యానించింది. ముంబాయి, హైదరాబాద్, శ్రీనగర్‌ల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ధర్మాసనం తిరస్కరించింది. దేశవ్యాప్తంగా నమోదైన అన్ని కేసుల్లో మీరు మెజిస్ట్రేట్ల ముందు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని నూపుర్ శర్మ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. పిటిషన్ ఉపసంహరించుకోవాలని ధర్మాసనం సూచించడంతో నుపుర్ శర్మ తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు.