Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాల ఆగ్రహం
- విద్వేషపూరిత, ఉద్రిక్త వాతావరణం సృష్టించింది కేంద్రమే : రాహుల్
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు బిజెపిపై మండిపడ్డాయి. బిజెపి సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రేగడానికి నూపుర్ శర్మే కారణమని సుప్రీంకోర్టు సరిగ్గా చెప్పిందని, బిజెపి తల దించుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. వాయనాడ్‌లో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో విద్వేష పూరిత, ఉద్రిక్త వాతావరణాన్ని కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తుందని విమర్శించారు. 'విద్వేషపూరిత, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది ప్రధానమంత్రి, హోం మంత్రి, బిజెపి, ఆర్ఎస్ఎస్' అని అన్నారు. ఇలాంటి వాతావరణం భారతదేశ, దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని తెలిపారు.
సుప్రీంకోర్టు చెప్పింది నిజమేనని, అయితే ఇలాంటి వాతావరణాన్ని ఆ వ్యక్తి (నూపుర్ శర్మ) సృష్టించలేదని, కేంద్రంలోని అధికార యంత్రాంగం దీన్ని సృష్టించిందని రాహుల్ చెప్పారు. 'విధ్వంసక విభజన సిద్ధాంతాలపై' పోరాడాలనే కాంగ్రెస్ సంకల్పాన్ని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసిందని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో అధికారంలో ఉన్న పార్టీ సిగ్గుతో తలదించుకోవాలని పేర్కొన్నాయి.
చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం:సీతారాం ఏచూరి
'సుప్రీంకోర్టు వ్యాఖ్యల ప్రకారం దేశంలో జరిగిన హింసాకాండకు నూపుర్ శర్మపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. 'అసహనం, వేర్పాటువాదం, భారత దేశాన్ని దెబ్బతీయడం వంటిని ప్రమోట్ చేసే నూపుర్ శర్మ, వంటి వారిపై చర్యలు తీసుకోకపోతే... బయట ప్రపంచానికి తప్పుడు సందేశం వెలుతుంది. టీవి చర్చల్లో పాల్గొనడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేసే బిజెపి, ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీల నుంచి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు' అని పేర్కొన్నారు. 'ప్రజలంతా శాంతి కోసం పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. విభజించే, రెచ్చగొట్టే ప్రకటనలు వ్యతిరేకించాలి. మేం ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు న్యాయం లభించడం కోసం చేయవల్సిందంతా చేస్తాం. మత ఘర్షణల్లో ఇక ఎవరూ మరణించకూడదు. ఇక్కడ ఎవ్వరూ విజేతలు ఉండరు. విభజన వల్ల భారత్ ఎంతో నష్టపోయింది' అని సీతారాం ఏచూరి తెలిపారు.
వామపక్ష ఎంపి బినోరు విశ్వం సోషల్ మీడియాలో స్పందిస్తూ 'నూపుర్ శర్మకు రెడ్ కార్పెట్.. తీస్తా, శ్రీకుమార్‌కు జైలు గదులు. సుప్రీంకోర్టు వాఖ్యలతోనైనా మోడీ ప్రభుత్వం జాగ్రత్త పడాలి. బాధ్యతారాహిత్యం, మతోన్మాదం ఏ పార్టీ అధికార ప్రతినిధి ముఖ్య లక్షణం కాకూడదు. ఇలాంటి సంఘటనలు ఉదరుపూర్ లాంటి ఘటనలకు దారితీస్తాయి. ప్రజలకు, దేశానికి వారు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలి' అని అన్నారు. ప్రధాని మోడీ ఒత్తిడితోనే నూపుర్ శర్మపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఎఐఎంఇఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు.