Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : రాష్ట్రంలో సినిమా టికెట్లను ఎపి ఫిలిం డెవలప్మెంటు కార్పొరేషన్ (ఎపిఎఫ్డిసి) ఆన్లైన్ ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చట్ట సవరణ, జిఓలను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్లకు, బుక్ మై షో ఇతరుల ప్రయోజనాలు దెబ్బతినకూడదనే స్టే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆన్లైన్ టికెట్ల అమ్మకాలను కొంతకాలం నిలుపుదల చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అభిప్రాయపడింది. స్టే ఇవ్వకపోతే మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల లైసెన్సులు రద్దయ్యే ఆస్కారం ఉందని చెప్పింది. పిటిషన్లపై సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని, అందుకే స్టే ఇస్తున్నట్లు తెలిపింది. బుక్ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విడివిడిగా వేసిన రిట్లపై తుది విచారణ ఈ నెల 27న జరుపుతామని ప్రకటించింది.