Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుమతి సుంకం 5 శాతం పెంపు
- ఒకే రోజు రూ.1300 పెరిగిన పసిడి
న్యూఢిల్లీ : బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 10.75 శాతంగా ఉన్న సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిపికేషన్ జారీ చేసింది. నూతన పన్ను విధానం జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇది వరకు పసిడిపై ప్రాథమిక సుంకం 7.5 శాతంగా ఉండగా.. తాజాగా దీన్ని 12.5 శాతానికి చేర్చింది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక వసతుల సెస్ అదనంగా వేయడంతో పన్ను రేటు 15 శాతానికి చేరింది. దీనిపై మరో 3 శాతం జిఎస్టిని వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి వుంటుంది. దిగుమతి సుంకం పెంచడంతో ఒక్క పూటలోనే బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. శుక్రవారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1200 పెరిగి రూ.47,850కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారంపై ఏకంగా రూ.1310 ఎగిసి రూ.52,200గా పలికింది. కిలో వెండిపై రూ.1000 పెరిగి రూ.59,000గా నమోదయ్యింది. పసిడి దిగుమతులు ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్ తగ్గించే ఉద్దేశ్యంతో సుంకాలను పెంచినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. క్రితం మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి అయినట్లు పేర్కొంది.