Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన సర్కారు బకాయిలు
- ఉద్యోగుల్లో పెరుగుతున్న అసహనం
అమరావతి : 2018 జులై, 2019 జనవరి నెలలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు రూ.1,500కోట్లు పెండింగ్లో ఉండగా తాజాగా కొత్తగా డిఎ బిల్లులు జమ కావడం లేదని తెలిసింది. దీనికి సంబంధించిన ఆప్షన్ను ప్రభుత్వం లాక్ చేయడమే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. కొత్త డిఎలు కూడా అప్లోడ్ అయితే బకాయిల మొత్తం 3 వేల కోట్లకు చేరే అవకాశం ఉందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డ్రాయింగ్ ఆఫీసర్స్ (డిడిఓలు) బిల్స్ అప్లోడ్ చేసిన అనంతరం ట్రెజరీ ఆఫీపర్స్కు ఆయా బిల్లులను పంపాల్సి ఉంటుంది. అనంతరం సిఎఫ్ఎంఎస్లో బిల్లులు అఫ్రూవల్ కావాల్సి ఉండగా, ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్లో కొత్త బిల్లులు అప్లోడ్ కాకుండా డిజేబుల్ చేశారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఫలితంగా ఉద్యోగులకు రావాల్సిన డిఎ బకాయిలు, లీవ్ ఎన్క్యాష్మెంట్తో పాటు ఉద్యోగులకు రావాల్సిన పలు ఆర్ధిక అంశాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఉద్యోగులు ఎటువంటి క్లెయిమ్స్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సిఎఫ్ఎంఎస్లో ఆప్సన్ను అన్లాక్ చేసిన తరువాతే ఉద్యోగుల డిఎ బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన జిపిఎఫ్ అకౌంట్లనుంచి రూ.800కోట్ల వరకు ప్రభుత్వం దారి మళ్లించిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది సాంకేతిక లోపం వల్ల జరిగిన పొరపాటని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డిఎ బిల్లుల అప్లోడ్ కాకుండా చేయడం పట్ల ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతోంది.