Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- శాంతియుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి
- అరాచకాన్ని సృష్టించేందుకే ఈ దాడి : సీపీఐ(ఎం)
తిరువనంతపురం : గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్లో గల సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ద్వి చక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఒకడు కార్యాలయం సరిహద్దు గోడపై నాటు బాంబుతో దాడి చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో కేరళలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడికి కాంగ్రెస్ కారణమంటూ సీపీఐ(ఎం) విమర్శించింది. సంఘటన జరిగిన వెంటనే పెద్ద సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు కేరళవ్యాప్తంగా వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఏకేజీ సెంటర్ వద్ద వందల సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ విజయన్, ఇందుకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను కోరారు. శాంతిని భగం చేసి, రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా ఈ దాడిని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో శాంతియుతంగా వ్యవహరించాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడి వెనుక గల నీచపుటెత్తుగడలను గుర్తించి, ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా జాగ్రత్తగా వుండాల్సిందిగా వామపక్ష ఉద్యమాన్ని ప్రేమించే వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశానికి హాజరయ్యారు. ఈ దాడిని రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాల్సిందిగా పిలుపిచ్చింది.
''పెద్ద భవనం కూలితే ఎంత శబ్దం వస్తుందో అంతలా శబ్దం వినిపించింది.'' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి పి.కె.శ్రీమతి తెలిపారు. దాడి జరిగిన సమయంలో కార్యాలయం లోపల వున్న ఆమె తర్వాత మీడియాతో మాట్లాడారు. టివిలో వార్తలు వింటున్నా, వెంటనే భయంకరమైన సౌండ్ వచ్చింది, దాంతో వణికిపోయాం, కిటికీలోంచి చూడగా, దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఎంట్రన్స్ దగ్గరే పేలుడు పదార్ధం పేలిపోయింది, అందుకే ఆ ప్రయత్నం విఫలమైందని శ్రీమతి చెప్పారు.
ఎల్డీఎఫ్ ఖండన
వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) కన్వీనర్ ఇ.పి.జయరాజన్ దాడిని ఖండిస్తూ, రాష్ట్రంలో అరాచకత్వాన్ని సృష్టించేందుకే కాంగ్రెస్ ఈ దాడికి పాల్పడిందని విమర్శించారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు, కార్యాలయాలపై కాంగ్రెస్ వరుసగా జరుపుతున్న దాడుల్లో తాజా ఘటనే ఏకేజీ సెంటర్‌పై దాడి అని అన్నారు. పార్టీ కార్యాలయం ఎదురుగా గల అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు.
ముఖ్యమంత్రి విజయన్ విమానంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు. ఆరోగ్య మంత్రి వీణా జార్జిపై మెరుపుదాడి చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. వాయనాడ్‌లోని దేశాభిమాని పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. గాంధీ కార్యాలయంపై దాడిని సీపీఐ(ఎం) ఖండించిందని, కానీ దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్, యూడీఎఫ్ నేతలెవరూ ఖండించలేదని అన్నారు. కేరళను అల్లర్లు, ఘర్షణలతో దెబ్బతింటున్న రాష్ట్రంగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కన్నమ్ రాజేంద్రన్ విమర్శించారు.
కాగా, కాంగ్రెస్ కూడా ఈ దాడిని ఖండించింది. ఈ దాడికి తమకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ప్రభుత్వాన్ని పీడిస్తున్న కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే సీపీఐ(ఎం) ఈ దాడి పథకాన్ని పన్నిందని కేరళ పీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురీంద్రన్లు విమర్శించారు.
పోలీసు దర్యాప్తు
ఇదిలా వుండగా, దాడిచేసిన వ్యక్తి గురించి పోలీసులు మరింత సమాచారం సేకరించారని అదనపు డైరెక్టర్ జనరల్ విజరు శేఖర్ మీడియాకు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు వివిధ గ్రూపులను మోహరించినట్లు తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామన్నారు. దాడి జరిగిన వెంటనే నేర నిపుణులు సంఘటనా స్థలానికి వచ్చి సాక్ష్యాధారాలను సేకరించారు. దాడి చేసిన నాటు బాంబులో ఎలాంటి పదునైన, ప్రాణాంతకమైన పదార్ధాలు లేవని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాణాసంచాలో ఉపయోగించే తక్కువ స్థాయి పౌడర్‌ను ఉపయోగించి ఈ పేలుడు పదార్ధం తయారుచేసినట్లుగా కనిపిస్తోంది. ఈ నాటు బాంబు పెద్దగా శబ్దం చేస్తుంది కానీ ఎవరినీ తీవ్రంగా గాయపరచదని, కాలే గాయాలవుతాయని తెలిపారు.
డిజిటల్ వల
దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కొన్ని క్లూస్‌ని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు కమిషనర్ స్పర్జన్ కుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిఘా కెమెరా ఫుటేజీని వారు విశ్లేషిస్తున్నారు. నేరం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని అన్ని ఫోన్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా సెల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్లను కోరారు. ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తి అన్నీ బాగా ఆలోచించే దాడికి దిగినట్లు కనిపిస్తోందని దర్యాప్తు అధికారి వ్యాఖ్యానించారు. ఏకేజీ సెంటర్ ఎదురుగా గల పోలీసు అధికారుల ఉనికి గురించి ఫార్వర్డ్ స్కౌట్ ఒకరు తెలియచేయడంతో దాడి చేసిన వ్యక్తి ఎలాంటి కాపలా లేని సెకండ్ గేట్ వద్ద దాడి చేశాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2017లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై సీపీఐ(ఎం) దాడి ఘటనతో దీనికేమైనా సంబంధం వుందా లేదా అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులోని నిందితుడిపై అభియోగాలు తొలగించాల్సిందిగా కోరుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
దాడి జరిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీపీఐ(ఎం), విద్యార్ధి, యువజన, ఇతర వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. దాడి జరిగిన వెంటనే ఆ దాడిని ఖండిస్తూ నగరవ్యాప్తంగా అర్ధరాత్రి సమయంలో వందలాదిమంది ప్రదర్శన చేశారు. జిల్లా శాఖల ఆధ్వర్యంలో కూడా నిరసనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సీఐటీయూ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. పెద్ద సంఖ్యలో కార్మికులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. ప్రాంతీయ కేంద్రాలతో సహా ప్రధాన రాష్ట్ర కేంద్రాల్లో మరిన్ని నిరసనలకై పార్టీ శాఖలు పిలుపిచ్చాయి.