Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఖజానాకు ఏటా రూ.67వేల కోట్లు ఆదాయం!
- రష్యా చమురు రాయితీ ధరతో రిలయన్స్, కెయిర్న్, నయారా ఎనర్జీలకు భారీ లాభాలు
న్యూఢిల్లీ : విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై 'ఎగుమతి పన్ను' విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అలాగే దేశీయంగా ఓఎన్జీసీ, వేదాంత వంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్గా అదనపు పన్నును విధిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. లీటర్ పెట్రోల్, ఏటీఎఫ్ ఎగుమతిపై రూ.6, లీటర్ డీజిల్‌పై రూ.13 ఎగుమతి పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరోవైపు దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఒక్కో టన్ను ముడి చమురుపై సంస్థలు రూ.23,250 అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
దేశీయంగా ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సహా ప్రయివేటు కంపెనీలైన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత కంపెనీలు ఏటా 2.9కోట్ల టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేస్తున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం అదనపు పన్ను విధించడంతో కేంద్ర ఖజానాకు ఏటా రూ67,425కోట్ల ఆదాయం సమకూరనున్నది.
లాభాలు పోగేసుకున్న ప్రయివేటు చమురు శుద్ధి కంపెనీలు
ఎలాంటి మూలధన పెట్టుబడి, వ్యాపార విస్తరణ లేకుండా పొందే అనూహ్య లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా చమురుపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు రష్యా రాయితీ ధరతో చమురును విక్రయిస్తోంది. ఫలితంగా రిలయన్స్ ఇండిస్టీస్, నయారా ఎనర్జీ వంటి ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు సైతం తక్కువ ధరకే ముడి చమురును పొందుతున్నాయి. ఆపై దీన్ని శుద్ధి చేసి ఐరోపా, అమెరికా దేశాలకు సాధారణ ధరకు విక్రయించి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్నాయి.
సంస్థలు ఆర్జిస్తున్న ఈ అనూహ్య లాభాల నుంచి ఆదాయం సమకూర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. బాగా లాభాలకు అలవాటు పడ్డ ప్రయివేటు చమురు శుద్ధి సంస్థలు దేశీయ అవసరాలను తుంగలో తొక్కుతున్నాయి. ఫలితంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో కొరత ఏర్పడింది. దీన్ని నివారించడంలో భాగంగానే ఎగుమతి పన్ను, విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను అమల్లోకి తెచ్చినట్టు స్పష్టమవుతోంది.