Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనపై ఉన్న తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
- 146 మంది సామాజిక, ప్రజాస్వామ్యవాదుల ఉమ్మడి ప్రకటన
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలని సామాజిక, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు 146 మంది సామాజిక, ప్రజాస్వామ్యవాదులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టు జుబైర్‌పై ఉన్న తప్పుడు కేసులన్నింటినీ ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. జుబైర్‌ను అరెస్టు చేసే సమయంలో డికె బసు మార్గదర్శకాలను ఉల్లంఘించిన అధికారులపై ఢిల్లీ పోలీసు కమీషనర్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జుబైర్‌ని అక్రమంగా అరెస్టు చేసిన తీరు దృష్ట్యా ఆయన భద్రత, పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురయ్యే అవకాశం గురించి కూడా తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జుబైర్ అరెస్టు తరువాత అతని న్యాయవాదులు పదేపదే అభ్యర్థించినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదు. జూన్ 27 రాత్రి పోలీసు రిమాండ్ ఆర్డర్ తరువాత మాత్రమే వారికి కాపీని అందించారు. అందులో పేరు పొందపరచకుండానే జుబేర్‌ను తీసుకెళ్లారు. ఇవన్నీ దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు, నిర్బంధానికి సంబంధించిన డికె బసు మార్గదర్శకాల ఉల్లంఘనలేనని పేర్కొన్నారు. 1998లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఆమోదించిన మానవ హక్కులకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఉండాలని, దేశంలోని హెచ్ఆర్డీలతో సహా ప్రభుత్వాన్ని విమర్శించే వారందరికీ భద్రతను కల్పించాలీ, స్వేచ్ఛను పరిరక్షించాలని కోరారు. ఈ ప్రకటనపై రచయిత, మానవ హక్కుల నేత ఆకార్ పటేల్, న్యాయవాది ఆదిత్య శ్రీవాత్సవ, ఐద్వా నేతలు మరియం ధావలే, మెమునా మొల్లా, ఎఫ్ఐడబ్ల్యు నేత అనీ రాజాతో పాటు జర్నలిస్టులు, ఆర్థిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమకారులు, న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలు, కార్మిక సంఘాల నేతలు, విద్యా వేత్తలు, సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సంతకాలు చేశారు.