Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్ జాతీయ కన్వెన్షన్ పిలుపు
- అంగన్వాడీలపై అణచివేతకు వ్యతిరేకంగా తీర్మానం
- అంగన్వాడీలకు గ్రాట్యుటీపై సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలి
న్యూఢిల్లీ : అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్‌ల సమస్యల పరిష్కారం కోసం జులై 26 నుంచి 29 వరకు నాలుగు రోజులు పాటు ఢిల్లీలో మహా పడవ్ నిర్వహించాలని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) జాతీయ కన్వెన్షన్ పిలుపునిచ్చింది. అంగన్వాడీలకు గ్రాట్యుటీ, ఇతర సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయాలని, 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్సీ) సిఫార్సుల అమలు చేయాలనే డిమాండ్లను ఈ సమావేశం పునరుద్ఘాటించింది. సమ్మె సమయంలో హర్యానా, ఢిల్లీలో తొలగించిన వర్కర్స్, హెల్పర్స్‌ల తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తమ పోరాటాన్ని కొనసాగించాలని కన్వెన్షన్ నిర్ణయించింది. శనివారం నాడిక్కడ మీరా దత్తా నగర్‌లోని బీటీఆర్ భవన్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల హక్కుల కోసం జాతీయ కన్వెన్షన్ జరిగింది. ఈ కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు హాజరయ్యారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల హక్కులతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్యం, బాలల విద్య వంటి వాటి గురించి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులపై అణచివేతకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టగా, ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లింపు, వారి పని పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేసింది. ''కనీస వేతనాలు, తగిన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం సక్రమంగా చెల్లించేలా ఐసీడీఎస్‌కు తగిన కేటాయింపులు చేయాలి. నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆర్టీఈ చట్టంలో భాగంగా చిన్నారుల విద్య, సంరక్షణ (ఈసీసీఈ)ని ప్రకటించాలి. అంగన్వాడీలను నోడల్ ఏజెన్సీలుగా చేయాలి. డిజిటలైజేషన్, పోషన్ ట్రాకర్ అమలుకు ముందు టాబ్లెట్లు, నెట్వర్క్, డేటా ప్యాక్‌లను అందించాలి. కరోనా మహమ్మారి విధుల్లో ఉన్నవారికి రిస్క్ అలవెన్స్ చెల్లించాలి. కోవిడ్ 19 బాధితులకు పరిహారం ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్ హక్కులను గుర్తించాలి'' అని కన్వెన్షన్ డిమాండ్ చేసింది. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్, సీఐటీయూ ఆధ్వర్యంలో దేశంలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు జులై 26 నుంచి 29 వరకు ఢిల్లీలో మహాపడావ్ నిర్వహించాలని కన్వెన్షన్ నిర్ణయించిందని సంఘం ప్రధాన కార్యదర్శి ఎఆర్ సింధూ తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యం చేయడంతో పాటు కార్మికులుగా గుర్తింపు, కనీస వేతనాలు, పెన్షన్, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. తమ హక్కులతో పాటు ప్రజల హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ అధ్యక్షురాలు కె.హేమలత మాట్లాడుతూ బీజేపీ మతపరమైన విషాన్ని వ్యాపింపజేస్తూ ప్రజలను విభజిస్తున్నదనీ, ప్రజల వాస్తవ సమస్యల నుంచి పక్కదోవపట్టిస్తున్నదని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాల క్రియాశీల మద్దతుతో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని హిందూత్వ శక్తులు చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి లక్ష్యం అంతిమంగా కార్పొరేట్ ఎజెండాకు సేవ చేయడమేనని ధ్వజమెత్తారు. మతోన్మాద శక్తులను బహిర్గతం చేయడంతో ప్రజల మధ్య మత సామరస్యం, శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీల గ్రాట్యుటీ కేసులో గుజరాత్ అంగన్వాడీ యూనియన్ తరపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పివి సురేంద్రనాథ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును వివరించారు. ఈ కన్వెన్షన్‌లో గుజరాత్ అంగన్వాడీ యూనియన్ అధ్యక్షుడు అరుణ్ మెహతా, వీణా గుప్తా, అంజు మైని తదితరులు ప్రసంగించారు.