Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్ బీజేపీ నాయకుల సోషల్‌మీడియా ఫొటోల్లో హంతకుడు రియాజ్ అత్తారీ
- అధికారికంగా దీనిపై ఇంకా స్పందించని బీజేపీ
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పాశవికంగా వ్యవహరించిన నిందితులపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే దోషుల్లో ఒకడు రియాజ్ అత్తారీ..రాజస్థాన్‌లో స్థానిక బీజేపీ నాయకుడని, ఆర్ఎస్ఎస్కు నమ్మకమైన కార్యకర్తని వార్తలు వెలువడుతున్నాయి. రాజస్థాన్ బీజేపీ మైనార్టీ మోర్చా, ఆర్ఎస్ఎస్ సారథ్యంలోని 'ముస్లిం రాస్ట్రీయ మోర్చా'లలో ఇర్షాద్ చైన్వాలా, మహ్మద్ తాహీర్ కీలక నాయకులుగా ఉన్నారు. వీరి ఫేస్బుక్ టైమ్‌లైన్స్ ఫొటోగ్రాఫ్స్లో రియాజ్ అత్తారీ వారితో కలిసివుండటం స్పష్టంగా ఉంది. ఉదరుపూర్ బీజేపీ నాయకుడు రవీంద్ర శ్రీమాలి, రాజస్తాన్ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియాలు హాజరైన ఒక కార్యక్రమంలో వారితో రియాజ్ అత్తారీ దిగిన ఫొటో ఉంది. ఇదంతా చూస్తే రియాజ్ అత్తారీకి బీజేపీకీ, ఆ పార్టీ నాయకులకు బాగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదరుపూర్ బీజేపీ చీఫ్ రవీంద్ర శ్రీమాళిను న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్' సంప్రదించగా ఆయన ..''అతడ్ని ఎప్పుడూ కలవలేదు. అతడెవరో కూడా తెలియదు. ఆ రోజు నన్ను కలవడానికి ఎంతోమంది వచ్చారు. ఆ గుంపులో అతడెవరన్నది నేను గుర్తించలేదు. రియాజ్ అత్తారీకి బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదు. ఏ విచారణకైనా నేను సిద్ధమే''నని చెప్పారు. అలాగే బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియా కూడా రియాజ్ అత్తారీ ఎవరో (న్యూస్ 24తో మాట్లాడుతూ) తెలియదన్నాడు. ప్రభుత్వ కార్యాక్రమాలకు ఎంతోమంది వస్తుంటారు...అలాగే రియాజ్ కూడా వచ్చి వుంటాడు...అని కటారియా చెప్పారు. రాజస్థాన్ బీజేపీని దెబ్బతీయడానికి కొన్ని సంవత్సరాల క్రితం రియాజ్ అత్తారీ అక్రమంగా చొరబడ్డాడని బీజేపీ అనుబంధ మీడియా కొన్ని వార్తలు ప్రసారం చేస్తోంది. హంతకుడికి బీజేపీతో సంబంధాలు ఉండటం వల్లే మీడియాలో అలాంటి ప్రచారాన్ని చేస్తున్నారని, బీజేపీ నష్టనివారణా చర్యల్లో భాగంగానే మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఉదరుపూర్ హత్య కేసులో నలుగురు నిందితుల్ని పోలీసులు శనివారం ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో నిందితులకు సంబంధాలున్నాయని, ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ఉందని మోడీ సర్కార్ అనుమానిస్తోంది.