Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది 9 కోట్ల మంది రైతులపై దాడి చేయటమే : ఏఐకేఎస్
న్యూఢిల్లీ : పాల ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీ విధించటాన్ని 'ఆల్ ఇండియా కిసాన్ సభ' (ఏఐకేఎస్) తీవ్రంగా ఖండించింది. పాలు, పాల ఉత్పత్తులు, ప్యాకింగ్‌తో అమ్మే పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీర్..మొదలైనవాటిపై 5శాతం జీఎస్టీ విధిస్తూ 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కేంద్రం ఇటీవల నిర్ణయించింది. అంతేగాక డైరీ సంబంధిత పరికరాలు, యంత్రాలపైనా జీఎస్టీని 12శాతం నుంచి 18శాతానికి పెంచింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులపై, 9కోట్లమంది రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏఐకేఎస్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీ విధింస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. పన్ను విధింపు, పెంపు కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలపైనా ప్రభావం పడుతుందని, డైరీ రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ పెంపు నిర్ణయం సహకార సంఘాలకు గొడ్డలిపెట్టు వంటిదని పేర్కొన్నది. కేంద్రంలో రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల హక్కుల్ని మోడీ సర్కార్ కాలరాస్తోందని ఆరోపించింది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు తిరోగమన చర్యగా అభివర్ణించింది. దేశంలో అణగారిన వర్గాల, వెనుబడిన వర్గాల పోషకాహారాన్ని సైతం ప్రభావితం చేస్తుందని, ఆ వర్గాలకు డైరీ ఉత్పత్తులు దూరమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీని ఆధారంగా చేసుకొని మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఎస్టీ విధింపును ఉపసంహరించుకోకపోతే డైరీ రైతులు, సహకార సంఘంలో పనిచేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించింది. డైరీ ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.