Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : దేశాన్ని ఐక్యం చేసే అంశాలపై ప్రజలు దృష్టి సారించాలి తప్ప.. విభజించే వాటిపై కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ హితవు పలికారు. ' సమాజంలో సంఘటితమనేది ఐక్యతను బలపరుస్తుంది. ఇది శాంతి, పురోగతికి కీలకం. మనం మనల్ని ఏకం చేసే సమస్యలపై దృష్టి పెట్టాలి. మనల్ని విభజించే వాటిపై కాదు. మానవ, సామాజిక సంబంధాలను శాసించేలా 21వ శతాబ్దంలో విభజన, చిన్న, సంకుచిత సమస్యలకు తావునివ్వకూడదు. మానవాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడానికి మనం అన్ని విభజన సమస్యల కన్నా ఎదగాలి. సమిష్టి లేమీ విపత్తుకు ఆహ్వానం' అని శానిఫ్రాన్సిస్కోలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అదేవిధంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వారి బంధువుల గురించి ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ' దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడకు వచ్చి మీరు బిలినియర్, మిలినియర్లు అయ్యి ఉండొచ్చు. కానీ ఆ సంపదను అనుభవించేందుకు శాంతి అనేది చుట్టూ ఉండాలి. మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులు కూడా ద్వేషం, హింస లేని సమాజంలో జీవించగలగాలి' అని పేర్కొన్నారు. భారత్, అమెరికా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయని, ప్రపంచంలో ప్రతిచోటా వైవిధ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైవిధ్యాన్ని గౌరవించడం, కృషి, అసాధారణ నైపుణ్యాల ద్వారా అమెరికా తన ముద్ర వేయగలుగుతుందని అన్నారు.
న్యాయ వ్యవస్థపై రాజకీయ పార్టీల లోపభూయిష్ట అంచనాలను గురించి కూడా ప్రస్తావించారు. 'ప్రతి ప్రభుత్వ చర్యకు న్యాయ పరమైన ఆమోదం లభిస్తుందని అధికారంలో ఉన్న పార్టీ విశ్వసిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మరోలా ఆశిస్తాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థ పనితీరు గురించి ప్రజలకు సరైన అవగాహన లేక పోవడంతో ఈ లోపభూయిష్ట ఆలోచనలు అభివృద్ధి చెందాయి' అని వ్యాఖ్యానించారు. సాధారణ ప్రజల్లో అజ్ఞానం అటువంటి శక్తులకు సాయం చేస్తోందని, ఆ శక్తుల ప్రధాన ఉద్దేశం స్వతంత్య్ర వ్యవస్థ అయిన న్యాయ వ్యవస్థను నాశనం చేయడమేనన్నారు. వాస్తవంగా చెప్పాలంటే తాము రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీలమని చెప్పారు.