Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదులతో బీజేపీ బంధం బట్టబయలు
- జమ్ము ప్రావిన్స్ ఐటీ సెల్ నేతగా తీవ్రవాది
- రాజస్థాన్ హత్య కేసు నిందితుడూ బీజేపీ కార్యకర్తే
- కాషాయ ఉగ్రవాదంపై నివ్వెరపోయే వాస్తవాలు
శ్రీనగర్/న్యూఢిల్లీ : ఉగ్రవాదులు, నరహంతకులతో బీజేపీకి ఉన్న అనుబంధాలు వరుసగా వెలుగులోకి వస్తుండటం దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. రాజస్థాన్లో దర్జీ హత్య కేసు నిందితుల్లో ఒకడు బీజేపీ కార్యకర్త అని తేలిన వెనువెంటనే మరో ఉగ్రబంధం బయటపడింది. జమ్ముకాశ్మీర్లో ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు సాహసోపేతంగా బంధించి పోలీసులకు అప్పగించగా..వారిలో ఒక ఉగ్రవాదిని బీజేపీకి క్రియాశీలక కార్యకర్తగా గుర్తించారు. అతడు జమ్ము ప్రావిన్సు మైనార్టీ మోర్చా ఐటీ సెల్ ఇన్చార్జీగా పనిచేస్తున్నట్లు నిర్ధారణైంది. కేంద్రంలో ఎనిమిదేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఒక జాతీయ పార్టీ ఉగ్రమూలాలు అటు రాజస్థాన్లోనూ ఇటు సున్నితమైన జమ్ముకాశ్మీర్ ప్రాంతంలోనూ బయటపడటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతూ కార్పొరేట్ల సేవలో పునీతమౌతున్న మోడీ సర్కార్ ఆ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మత విద్వేషాలు రాజేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉగ్రవాద మూలాలు వెలుగుచూస్తుండటం దేశాన్ని నివ్వెరపాటుకు గురిచేస్తోంది.
జమ్ములో గ్రామీణుల సాహసంతో
బీజేపీ ఐటీ సెల్ నేత సహా ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
జమ్మూలోని రేయాసి ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన ప్రజలు ఆదివారం నాడు సాహసోపేతంగా స్పందించి ఇద్దరు ఉగ్రవాదులను ఇంట్లో బంధించారు. మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్న గ్రామస్తులు అనంతరం ఇరువురిని భద్రతాబలగాలకు అప్పగించారు. లష్కరే తోయిబాకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకడు తాలిబ్ హుస్సేన్ షా, మరొకడు అతని అనుచరుడు.
అయితే తాలిబ్ హుస్సేన్ షాను జమ్ముకాశ్మీర్లో బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా గుర్తించారు. సదరు ఉగ్రవాది బీజేపీ అనుబంధ మైనార్టీ మోర్చాకు జమ్ము ప్రావిన్సు సోషల్ మీడియా విభాగ ఇన ్చార్జీగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో భద్రత బలగాలు సైతం విస్తుపోయాయి. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసిన భద్రతాబలగాలు, వారి నుంచి ఎకె రైఫిళ్లు, పలు గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ సభ్యత్వంపై నెపం
బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం సోషల్ మీడియా నేత తాలిబ్ హుస్సేన్ షా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది అని తేలడంతో బీజేపీ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. నెపాన్ని ఆన్లైన్ సభ్యత్వంపైకి నెట్టేసి చేతులు కడిగేసుకోవాలని విఫలయత్నం చేసింది. ఎటువంటి నేపథ్యాలను సరైన తనిఖీ చేయకుండానే ఆన్లైన్లో మెంబర్షిఫ్ చేపట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ పఠానియా తెలిపారు. ' ఈ అరెస్టుతో కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. బీజేపీలోకి వచ్చేందుకు ఇదో కొత్తరకం ఎత్తుగడ'గా ఆయన పేర్కొన్నారు.
అయితే మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులను కూడా సభ్యులుగా చేర్చేసుకొనే అంతటి లోపభూయిష్టమైన ఐటి విభాగం బీజేపీకి ఉందా అనంటే 'సరైన తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలాంటివి ఉత్పన్నమవుతాయ'ని ఆయన సమాధానం దాటవేశారు. ఒకవేళ ఆన్లైన్ సభ్యత్వం అంటే నేపథ్యాన్ని తనిఖీ చేయకుండా ఇచ్చివండవచ్చు..కానీ నాయకత్వ బాధ్యతలను కూడా అలానే ఇస్తారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు బీజేపీ జమ్ముకాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలతో తాలిబ్ హుస్సేన్ షా ఫొటోలు కూడా దిగారు. కాగా సాహసోపేతంగా ఉగ్రవాదులను బంధించి అప్పగించిన రేయాసి గ్రామస్తులకు లెఫ్టినెంట్ గవర్నరు, జమ్ముకాశ్మీర్ పోలీసు ఛీఫ్ నగదు రివార్డును ప్రకటించారు. 'రేయాసి జిల్లా తుక్సాన్ గ్రామ ప్రజలకు హ్యాట్సాప్. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మారణాయుధాలతో సహా బంధించి అప్పగించారు. గ్రామస్తులకు డీజీపీ రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు' అని జమ్ము పోలీసు అదనపు డీజీ ట్వీట్ చేశారు.
చాలా తీవ్రమైన అంశం : ఏచూరి
బీజేపీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం పట్ల సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. ఇది చాలా తీవ్రమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. 'ఇది చాలా తీవ్రమైన అంశం. అధికార బీజేపీ నుంచి సమాధానం రావాలి. ఈ ఉగ్రవాద సంబంధాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చాలి. అది జమ్ముకాశ్మీర్ కానీ, లేదా రాజస్థాన్ కానీ ఉగ్రమూలాలపై దర్యాప్తు జరపాలి' అని ఆయన ఆదివారం నాడు ట్వీట్ చేశారు.