Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ట్న్యూస్పై దాడులకు ట్విట్టర్ అకౌంట్లు
- అనామక ఖాతా నుంచి ఫిర్యాదుతో అరెస్టు
- బీజేవైఎం కార్యకర్త వికాస్ అహిర్‌కు ఈ నెట్‌వర్క్‌తో సంబంధం
న్యూఢిల్లీ : జర్నలిస్టు, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ అరెస్టు వెనక హిందూత్వ శక్తులు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా హస్తం కనిపిస్తున్నది. ఒక పటిష్ట ప్రణాళికతో జుబేర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు బీజేపీ సోషల్ మీడియాకు ఆయుధంగా పని చేసే, సామాజిక మాద్యమ వినియోగదారులను తప్పుదోవ పట్టించే 'టెక్‌ఫాగ్' మొబైల్ సాఫ్ట్వేర్ ఆయుధంగా పని చేసింది. ఇందులో భాగంగా జుబైర్ గతంలో చేసిన ట్వీట్లను ప్రస్తుతం హైలెట్ చేస్తూ అరెస్టుకు ఉసిగొల్పేలా పలు ట్విట్టర్ ఖాతాలు పని చేయటం గమనార్హం. హిందూ యువ వాహిని (హెచ్‌వైవీ) రాష్ట్ర అధ్యక్షుడు, గుజరాత్ బీజేవైఎం కో-కన్వీనర్ వికాస్ అహిర్‌కు ఈ అనామక ఖాతాల నెట్‌వర్క్‌తో సంబంధమున్నట్టు తెలుస్తున్నది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ కింద మహమ్మద్ జుబేర్‌ను గతనెల 27న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇది ఒక అనామక ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఫిర్యాదును అనుసరించి అరెస్టు జరగటం గమనార్హం. 'హనీమూన్' పేరు (హిందీలో రాసి ఉన్నది) మీద ఉన్న ఒక ఫోటో తన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. అయితే, అది 1983లో తీసిన ఒక సినిమా సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ అని కొందరు నిపుణులు తెలిపారు. జూన్ 29న జుబేర్ బెయిల్ విచారణ సందర్భంగా.. 'దేశంలో అల్లర్లు సృష్టించేందుకు' అనామక ఖాతా ద్వారా ఫిర్యాదు చేశారు' అని జుబేర్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ వాదించారు. ఇటు కోర్టులో ఆ అనామక ఖాతాదారుడి గురింపు వెల్లడి విఫలమైంది. దీంతో, గతనెల 29న పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 91 కింద ట్విట్టర్‌కు నోటీసు పంపారనీ, సదరు అనామక ఖాతా వివరాలను అందించాలని కోరినట్టు ఒక వార్త సంస్థ నివేదించింది.
లింక్ చేయబడిన ఖాతాల నెట్వర్క్
జుబేర్‌తో పాటు ఆల్ట్ న్యూస్ మరో సహ వ్యవస్థాపకులు ప్రతీక్ సిన్హా లను తప్పుగా చూపించటానికి అహిర్‌తో సంబంధమున్న 757 ట్విట్టర్ ఖాతాలు పని చేసినట్టు ఒక ప్రయివేటు వార్త సంస్థ దర్యాప్తులో తేలింది. ఆ ఇద్దరు జర్నలిస్టులు గతంలో చేసిన ట్వీట్లను ఇవి హైలెట్ చేశాయి. వారిద్దరినీ హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించాయి. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరి పాత ట్వీట్లను స్థానిక యంత్రాంగాలకు ట్యాగ్ చేసి, మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ అరెస్టు చేసేలా నెట్వర్క్్ పని చేసినట్టు తెలుస్తున్నది. ప్రత్యేకించి అనామక ట్విట్టర్ ఖాతాకు ఎనిమిది ప్రతిరూప ఖాతాలున్నాయి. ఈ ఎనిమిది ఖాతాలలో ప్రతి ఒక్కటీ ఒకే విధమైన లక్షణాలను ప్రదర్శించటం గమనార్హం. ఈ నెట్వర్క్ నుంచి గతనెలలో రోజుకు 500 కంటే ఎక్కువ సార్లు పోస్టులు వెలువడినట్టు సమాచారం. జుబేర్ అరెస్టుకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఆటోమేట్ చేయడానికి, స్పామ్‌లను లక్ష్యంగా చేసుకోవటానికి చీప్ బాట్లు, డన్ క్విక్ వంటి థర్డ్-పార్టీ సాధనాల ఉపయోగమూ జరిగినట్టు తెలిసింది. గతనెల 1 నుంచి 30 మధ్యకాలంలో మూడు హ్యాష్‌ట్యాగ్‌లను విశ్లేషించారు. బీజేపీతో అనుబంధమున్నవారు, రాజకీయ నాయకులతో ప్రచారం చేయబడిన తర్వాత అవి 'ట్రెండ్'కు చేరుకున్నాయని ఒక టెక్ కంపెనీ విశ్లేషణలో తేలింది. అయితే, ఈ పెద్ద నెట్‌వర్క్‌లో దాదాపు 62 శాతం ఖాతాలు అరెస్టు చుట్టూ ప్రజల అవగాహనను మార్చడానికి ప్రయత్నించటమూ ఇందులో భాగమని తేలింది. వీటిలో చాలా ఖాతాలూ ప్రస్తుత దర్యాప్తు తర్వాత నిష్క్రియంగా మారినట్టు తెలిసింది.
వికాస్ అహిర్ ఎవరు?: వికాస్ అహిర్ గుజరాత్‌కు చెందిన వ్యక్తి. అతని వెబ్సైట్ ప్రకారం.. యూపీ సీఎం యోగి స్థాపించిన హిందూ యువ వాహిని రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే, భారతీయ జనతా యువ మోర్చా ఒక పట్టణ సమన్వయకర్త. జుబైర్‌ను లక్ష్యంగా చేసుకొని విస్తరించిన నెట్‌వర్క్‌కు లింక్ అయిన అతని ట్విట్టర్ హ్యాండిల్.. 1.07 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్నది.