Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల ఉత్పత్తుల మీద జీఎస్టీపై రైతు సంఘాల ఆగ్రహం
- కేంద్రం వ్యవహార శైలిపై ఆగ్రహం
- పాడి పరిశ్రమను కార్పొరేట్లకు అప్పగించే యత్నం
న్యూఢిల్లీ : డెయిరీ ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని ప్రవేశపెట్టే నిర్ణయంపై దేశంలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చిన్న డెయిరీలు, అన్నదాతలకు 'మరణ ఘాతం' అని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పాల ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించాలనీ, పాల యంత్రాలతో సహా డెయిరీ మెషనరీపై 12 శాతం నుంచి 18 శాతం వరకు పన్ను రేటును పెంచాలని 47వ కౌన్సిల్ చేసిన సిఫారసులు పాల ఉత్పత్తిపై ఆధారపడిన తొమ్మిది కోట్ల వ్యవసాయ కుటుంబాలపై ప్రభావం చూపుతాయని అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. బీజేపీ సర్కారు తీరును ఆయన తప్పుబట్టారు.
ఆయన మాట్లాడుతూ.. '' భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. 75 శాతం గ్రామీణ కుటుంబాలు 2-4 ఆవులను కలిగి ఉన్నాయి. అట్టడుగు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, రైతులు పాడి పరిశ్రమపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. తొమ్మిది కోట్ల వ్యవసాయ కుటుంబాలకు ఈ రంగం ఆర్థిక ప్రాముఖ్యతను చూపుతుంది. అయితే, జీఎస్టీలో ఇటీవలి మార్పులు ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్న ప్రాథమిక ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలిగించవు. ధరల పెరుగుదల అణగారిన తరగతి ప్రజల పోషకాహార అవసరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది'' అని అన్నారు.
రాజ్యాంగం 'ప్రాథమిక నిర్మాణం', సహకార సమాఖ్యను ధ్వంసం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. జీఎస్టీ విధానం గత ఐదేండ్లలో పేద రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలపై ప్రతికూల ప్రభావం చూపిందనీ, గుత్తాధిపత్య సంస్థల వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే ఆర్థిక విధానాలకు దారి తీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
జై కిసాన్ ఆందోళన ప్రతినిధి మనీశ్ భారతి మాట్లాడుతూ.. ''వ్యక్తిగత వ్యాపారాల విజయం నిర్ధిష్ట మార్కెట్లో పని చేసే వ్యక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం విధానాలను ప్రవేశపెట్టినప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. డెయిరీ రంగంలో సరిగ్గా అదే జరుగుతున్నది. ఉత్పత్తి చేయబడిన పాలలో ఎక్కువ భాగం ఫెడరేషన్ల ద్వారా ప్రాసెస్ చేయబడి వినియోగదారులకు విక్రయించబడుతున్నది. ఈ ఫెడరేషన్లు చివరికి రైతులు, వినియోగదారులపై భారాన్ని పెడతాయి. పశుగ్రాసం, మందులు, ఇతర ఇన్పుట్ ఖర్చులు పెరిగాయి. పశుగ్రాసం ధరలు గతేడాదితో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 800 నుంచి రూ.1600కి పెరిగాయి. ఆదాయం మాత్రం మారలేదు'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కఠిన పరిస్థితిలో కేంద్రానికి సంక్షోభం గురించి పూర్తి అవగాహన లేవని మనీశ్ భారతి అన్నారు.