Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార బీజేపీ అండదండలతో ఒప్పందం
- ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ సాగుచేసే ఆలోచన
- గిరిజనులు, జీవవైవిధ్యంపై తీవ్ర ప్రభావం : పర్యావరణవేత్తలు
న్యూఢిల్లీ: పామాయిల్ సాగు వద్దని పర్యావరణవేత్తలు, నిపుణులు ఎంత హెచ్చరించినా అసోంలో బీజేపీ సర్కార్ వినిపించుకోకుండా ఏకపక్షంగా ముందుకెళ్తోంది. పామాయిల్ సాగు చేపట్టేందుకు పతంజలికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పామాయిల్ సాగు పెరిగితే, ఆ భూములు నిస్సారమవుతాయని, నీటి వనరులు కాలుష్యమయం అవుతాయని, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, ఇదంతా కూడా ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులు, ఆదివాసీలపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పతంజలితో ఒప్పందం వద్దని, పామాయిల్ సాగుకు అనుమతి ఇవ్వొద్దని స్థానిక కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయి ప్రధాని మోడీని కలుసుకొని కోరారు. అనేకమంది నుంచి వ్యతిరేకత వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లింది. తాజా ఒప్పందం ప్రకారం, అసోంలోని తిన్సుకియా, జోహాత్, గోల్గాట్, నాగోన్, కామ్రూప్, గోల్పారా జిల్లాల్లో పతంజలి ఫుడ్స్ సంస్థ పామాయిల్ సాగు చేయడానికి అనుమతి లభించింది. త్రిపుర, మేఘాలయ, మణిపూర్, ఇతర రాష్ట్రాల్లోనూ పామాయిల్ సాగుపై ఒప్పందాలు చేసుకోబోతున్నామని గతంలో బాబా రామ్‌దేవ్ మీడియాకు చెప్పారు. ఆహార రంగంలో బడా కార్పొరేట్ కంపెనీలు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పామాయిల్ సాగుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరోవైపు దేశీయంగా పామాయిల్ దిగుబడిని పెంచాలన్న మోడీ సర్కార్ విధానాన్ని పర్యావరణ నిపుణులు తప్పుబడుతున్నారు. మొత్తం జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.