Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 125వ జయంతి సభలో ప్రధాని మోడీ
- వర్చువల్గా కాంస్య విగ్రహావిష్కరణ
- ప్రత్యేకహోదా, విభజనహామీల ఊసులేని మోడీ ప్రసంగం
- విశాఖ ఉక్కు పోరూ విస్మరణ
భీమవరం: అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దేశం ప్రగతిపథంలోకి ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆజాద్కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భీమవరం శివారు కాళ్ల మండలం పెదఅమిరంలో సోమవారం జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎఎస్ఆర్.నగర్లో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చువల్ విధానంలో ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అల్లూరి పోరాటం, ఆయన ఇచ్చిన నినాదాలు వందేమాతర భావనకు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోడీ ప్రసంగం సుదీర్ఘంగా సాగినప్పటికీ పలు కీలకాంశాలకు ఆయన విస్మరించారు. పార్టీల కతీతంగా రాష్ట్ర ప్రజానీకం డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా, విభజన హామీల అంశం ప్రధాని ప్రసంగంలో చోటుచేసుకోలేదు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఒక్క కొత్త పథకాన్నీ ప్రకటించలేదు. అదే సమయంలో గిరిజనులకోసం తమ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో చేసిందని చెప్పడానికి ప్రధాని ప్రాధాన్యత ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సంవత్సరానికి పైగా జరుగుతున్న విస్తృత పోరాటాన్ని కూడా మోడీ విస్మరించారు. తెలుగు వీరలేవరా, దీక్షబూని సాగరా..' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ 'దమ్ముంటే తనని ఆపాలి' అని అంగ్లేయులకు సవాల్ విసిరారని, అదే స్ఫూర్తితో 130 కోట్ల మంది భారతీయులు ప్రస్తుతం సనిచేయాలని అన్నారు. 'యువకులు, ఆదివాసీలు, మహిళలు, దళితులు వెనుకబడిన, అణచివేయడబడిన వారు ఆ స్పూర్తితో కదలితే దేశాభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోగలరన్నారు. లంబసింగిలో అల్లూరి మోమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు.అల్లూరి జన్మస్థలం పాండ్రంగిలో జీవనోద్ధరణ చేయడం, దాడి చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్ అభివృద్ధి, మోగల్లులో ధాన్య మందిరం నిర్మాణం అమృత ఉత్సవాల్లో భాగంగా జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అల్లూరి వారసులను, మల్లుదొర వారసులను మోడీ సత్కరించారు.ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఒక దేశాన్ని మరో దేశం, ఒక జాతిని మరో జాతి, ఒక మనిషిని, మరో మనిషి దోచుకునే వీలులేకుండా ఉండాలని మన స్వాతంత్య్ర సమరయోధులు కలలు కన్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ఆగ్నికణం, తెలుగుజాతికి స్ఫూరి ప్రదాత, అడవి బిడ్డలకు ఆరాధ్యుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. జిల్లాల విభజనలో భాగంగా అల్లూరి పేరు జిల్లాకు పెట్టామన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వాతంత్య్ర పండగ ఏడాది పాటు సాగనుందని తెలిపారు. అల్లూరి సంచరించిన ప్రాంతాలను సందర్శనీయ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర్ర మంత్రులు ఆర్కె.రోజా, దాడిశెట్టి రాజా, కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు కె.చిరంజీవి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. మోడీని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాలువాకప్పి సత్కరించారు. అనంతరం ఆయనకు సీతారామ పట్టాభిషేకం చిత్రపటాన్ని, విల్లు, బాణాన్ని సీఎం బహూకరించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పీఎంకు ఉత్సవ కమిటీ సభ్యులు అందజేశారు. క్షత్రియ సేవాసమితి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి నడింపల్లి నానిరాజు స్వాగతోపన్యాసం చేశారు.