Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంశమేదైనా రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీ
- నుపుర్ వ్యాఖ్యలు.. ఉదరుపూర్ దర్జీ హత్య వరకు ఇదే తీరు
- సుప్రీంకోర్టు ఆదేశాలనూ వక్రీకరిస్తూ లబ్ది పొందుతున్న వైనం
- సంక్షేమ పథకాల ఊసే లేకుండా మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై విశ్లేషకుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలో మతానికి సంబంధించిన ఏ ఒక్క చిన్న గొడవ జరిగినా.. బీజేపీ దానిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. విద్వేషపూరిత మతరాజకీయాలే కేంద్రంగా ముందుకు వెళ్తున్నది. మొన్నటి హిజాబ్ వివాదం నుంచి నిన్నటి నుపుర్ శర్మ వ్యాఖ్యలు.. తదనంతరం రాజస్థాన్‌లోని ఉదరుపూర్ దర్జీ హత్య వరకూ.. ప్రతి అంశాన్నీ మతకోణంలో ముడిపెట్టి దానిని రాజకీయ ప్రయోజనాలకు ఆయుధంగా వాడుకుంటున్నని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బీజేపీ.. దాని అనుంబంధ సంఘాలు, సంస్థలు, సోషల్ మీడియాను క్రియాశీలంగా వినియోగిస్తున్నదని చెప్పారు. రాజస్థాన్‌లోని ఉదరుపూర్ ఘటనానంతరం బీజేపీ, దాని అనుబంధ సంఘాలు సోషల్ మీడియాలో విద్వేషాన్ని రగిల్చే పోస్టులను వైరల్ చేశాయి. ఇందులో భాగంగా ట్విట్టర్లో రెండు హ్యాష్‌ట్యాగ్‌లు 'హిందూలివ్స్మ్యాటర్', 'సుప్రీంకోర్టుకాంప్రమైజ్డ్' లను ట్రెండ్ చేశాయి. కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని మోడీ నడుస్తున్న ప్రమాదకరమైన మార్గాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇందులో ఏవీ బీజేపీ ద్వారా అధికారికంగా ఉత్పన్నం కానప్పటికీ.. అటు వైపు నుంచి అందిన ప్రోద్బలంతోనే ఇలాంటి ప్రచారాలు ఉధృతమవుతున్నాయని చెప్పారు.
1980ల చివరి నుంచి దశాబ్దాలుగా ఈ ద్వేషపూరిత రాజకీయాలను ఆ పార్టీ చేస్తున్నదని గుర్తు చేశారు. మోడీ పాలనలో ఈ మత విద్వేష రాజకీయం అంతకంతకూ పెరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ''అద్వానీ హయాంలో 'రథయాత్ర' మిగిల్చిన చేదు ఘటనలు విదితమే. ప్రస్తుతం మోడీ హయాంలో దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ విద్వేషపూరిత రాజకీయాలు విస్తరించాయి'' అని విశ్లేషకులు చెప్పారు. 2014 తర్వాత కూడా సంఫ్‌ు పరివార్ పెద్దలు రామ మందిర అంశాన్ని రాజకీయంగా వాడుకొని వీలైనంత లబ్దిని పొందారన్నారు.
ఇప్పుడు రాజస్థాన్‌లోని ఉదరుపూర్ ఉదంతాన్నీ బీజేపీ రాజకీయం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ, జడ్జిల అభిప్రాయాలనూ ఆ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, మద్దతుదారులు తప్పుబడుతున్న తీరును ఆక్షేపించారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టు రాజీపడిందనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేస్తున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దేశ రాజకీయాల్లో ఎలాంటి మద్దతూ లభించలేదన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా బీజేపీ లేదా దాని అనుబంధ సంస్థలేవీ ప్రధాన పార్టీలుగా ఎదగలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు గుర్తు చేశారు. ఆ తర్వాత రామ జన్మ భూమి అంశాన్ని ఆయుధంగా వాడుకొని ఆ పార్టీ రాజకీయం ఎదిగిందని తెలిపారు. ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలను పక్కనబెట్టి, అసలు ఆ అంశాలే చర్చకు రానీయకుండా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పరిపాలిస్తున్నదని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న విద్వేషపూరిత మత రాజకీయాలతో దేశం అతలాకుతలం అయ్యే ప్రమాదమున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు.