Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసిన అగ్నిపథ్ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. వచ్చేవారం దీనిపై వాదనలు విననున్నట్టు వెల్లడించింది. యువత సాయుధ బలగాల్లో స్పల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్రం గత నెల అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. 17.5 నుంచి 21ఏండ్ల మధ్య వయస్కులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏండ్లకు పెంచింది. ఎంపికైనవారు అగ్నివీరులుగా నాలుగేండ్లపాటు సేవలు అందిస్తారు. తర్వాత 25శాతం మంది శాశ్వత కేడర్‌కు ఎంపికవుతారని చెప్పింది. మిగిలిన 75శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్ కానున్నారు. అయితే రిలీవ్ సమయంలో కేంద్రం వారికి కొంత మొత్తం ఇవ్వనుంది. కరోనా కారణంగా రెండేండ్లుగా సైనిక ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులను ఈ ప్రకటన తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వైమానిక దళ అభ్యర్థుల తరఫున పిటిషన్ దాఖలైంది. ఆ అభ్యర్థులు ప్రస్తుతం శిక్షణ పొందారనీ, వారు అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారని వారి తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ సమయంలో వారు ఉద్యోగంలో ఉండే కాలం... 20 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు తగ్గిపోనుందని పిటిషన్లో పేర్కొన్నారు. ''ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించండి... ఎంతోమంది అభ్యర్థుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి'' అని అభ్యర్థించారు.