Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలోని విశాఖ, ఏలూరులో నిరసనలు
- గన్నవరంలో నల్ల బెలూన్లతో... పలువురి అరెస్టు
విశాఖ, ఏలూరు, గన్నవరం: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తున్న మోడీకి ఏపీలో అడుగుపెట్టే అర్హతలేదంటూ విశాఖలో మోడీ గో బ్యాక్ పేరిట నిరసనలు హోరెత్తాయి. కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్దకు సోమవారం ఉదయానికే పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన నల్ల జెండాలు చేబూని రాస్తారోకో నిర్వహించారు. హైవేను దిగ్బంధించి మోడీ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నాడు స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకోసం 32 మంది ప్రాణ త్యాగం చేశారనీ, నేడు దాన్ని రక్షించుకోవడానికి 300 మందైనా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు, ఉక్కు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉక్కు నగరంలోని బాబూ జగ్జీవన్‌రామ్ పార్క్ వద్ద స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మోడీ గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఏలూరులో..
ఏలూరు జ్యూట్ మిల్లు సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), సీపీఐ నేతలు మాట్లాడారు. గిరిజన హక్కులను, అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ అల్లూరి ఆశయాలకు తూట్లు పొడుస్తున్న మోడీ సర్కార్‌కు ఆయన జయంత్యుత్సవాలు చేసే అర్హత
లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. నల్లబెలూన్లు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ విజరుపాల్ మీడియాతో మాట్లాడుతూ..''కాంగ్రెస్ నేతలు నల్లబెలూన్లను ఎగురవేశారు. ప్రధాని భద్రతా విషయంలో ఎలాంటి వైఫల్యం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేత సుంకర పద్మ, సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేశాం. మిగతా వారిని కూడా గుర్తించి అరెస్ట్ చేస్తాం'' అని తెలిపారు.