Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా జులై 31న దేశవ్యాప్తంగా చక్కాజామ్
- అగ్నిపథ్‌ను ఆపాలని ఆగస్టు 7 నుంచి 14 వరకు ''జై జవాన్, జై కిసాన్'' సదస్సులు
- అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని 75 గంటల పాటు సాముహిక ధర్నా
- ఎస్కేఎం జాతీయ సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ: ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మోడీ సర్కార్ రైతులను ద్రోహం చేసిందనీ, ఇందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. కనీస మద్దతు ధర, ఇతర పెండింగ్ సమస్యలపై చట్టపరమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఘజియాబాద్‌లో జరిగిన ఎస్కేఎం జాతీయ సమావేశంలో రైతుల ఉద్యమానికి సంబంధించి మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో 15 రాష్ట్రాల నుంచి దాదాపు 200 మంది రైతు నేతలు పాల్గొన్నారు. పంజాబ్ ఎన్నికల సమయంలో సస్పెండ్ అయిన 16 రైతు సంఘాలు తిరిగి ఎస్కేఎంలో చేసేందుకు సమావేశం సమ్మతి తెలిపింది. 2021 డిసెంబర్ 9న మోర్చాను ఎత్తివేసినప్పుడు రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని తెలిపింది. ఎంఎస్పీపై కమిటీని ఏర్పాటు చేయలేదనీ, రైతులపై నమోదు చేసిన తప్పుడు కేసులు రద్దు చేయలేదని పేర్కొంది. విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించింది. కనీస మద్దతు ధర చట్టపరమైన హామీని పరిగణనలోకి తీసుకోవడానికి కూడా మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించింది. ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా జులై 18న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవమైన జూలై 31 వరకు దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ''ద్రోహానికి వ్యతిరేకంగా నిరసన'' బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు ఎస్కేఎం తెలిపింది. ఈ ప్రచారం ముగింపులో జూలై 31న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చక్కా జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక, యువత వ్యతిరేకమైన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగ యువతను, మాజీ సైనికులను సమీకరించాలని సమావేశంలో ఎస్కేఎం నిర్ణయించింది. అగ్నిపథ్ పథకాన్ని బహిర్గతం చేయడానికి ఆగస్టు 7 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ''జై జవాన్, జై కిసాన్'' సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపింది. లఖింపూర్‌ఖేరీ హత్యాకాండ జరిగిన 10 నెలల తరువాత కూడా అజరు మిశ్రాను కేంద్ర మంత్రివర్గంలో కొనసాగించటం దారుణమని ఎస్కేఎం పేర్కొంది. రైతులకు న్యాయం చేయడానికి ఎస్కేఎం కట్టుబడి ఉందనీ, బాధిత కుటుంబాలకు న్యాయ, ఇతర సహాయాన్ని అందిస్తోందని తెలిపింది. ఈ సమస్యను బలంగా లేవనెత్తడానికి 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 18 నుంచి 20 వరకు లఖింపూర్ ఖేరీలో 75 గంటల సామూహిక ధర్నాను నిర్వహిస్తామని తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా రైతు నాయకులు, కార్మిక నేతలు పాల్గొంటారని పేర్కొంది. రైతులపై పెరుగుతున్న అణచివేత, మానవ హక్కుల ఉద్యమకారులపై దాడి పట్ల ఎస్కేఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో రైతు నాయకుడు ఆశిష్ మిట్టల్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని, బెంగాల్‌లోని ఫరక్కాలో అదానీ హైవోల్టేజీ వైర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీచార్జీని, ఛత్తీస్‌గఢ్‌లో నిరసన తెలిపిన రైతులపై అణచివేతను ఎస్కేఎం ఖండించింది. తీస్తా సెతల్వాద్, ఆర్బి శ్రీకుమార్, ముహమ్మద్ జుబేర్ వంటి సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల అరెస్టులు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హక్కులపై పెరుగుతున్న అణచివేతను సూచిస్తున్నాయని విమర్శించింది. ఈ ప్రజాస్వామిక పోరాటంలో ఈ కార్యకర్తలు, సంస్థలందరికీ ఎస్‌కెఎం అండగా నిలుస్తుందని పేర్కొంది.