Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు అగాథంలోకి పడిపోతున్నది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా డాలర్‌తో పోల్చితే 79 దాటేసి.. 80కి చేరువలో పతనమవుతున్నది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 41 పైసలు కోల్పోయి 79.36కు దిగజారింది. ఇది ఆల్‌టైం రికార్డ్ కనిష్టం. ఉదయం 79.04 వద్ద ప్రారంభమై.. రోజంతా ఒత్తిడికి గురవుతూ.. 79.02 - 79.38 మధ్య కదలాడింది. సోమవారం సెషన్లో 78.95 వద్ద ముగిసింది. 2014కు ముందు బీజేపీ అధికారంలోకి రాకముందు.. డాలర్‌తో రూపాయి విలువ 68కి పడిపోతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నరేంద్ర మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఐసీయూలో పడిపోయిందని.. తాము అధికారంలోకి వస్తే దేశీయ కరెన్సీని ప్రపంచ మార్కెట్లో నిలదొక్కుకునేలా చేస్తామని అనేక గొప్పలు చెప్పారు. ప్రస్తుతం అంతకంటే దారుణమైన స్థితిలోకి రూపాయి పడిపోతున్నప్పటికీ.. కట్టడి చర్యలు కానరావడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. దేశీయ గణంకాలు బలహీనంగా చోటు చేసుకోవడానికి తోడు అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం రూపాయిని ఒత్తిడికి గురి చేసిందని బీఎన్పీ పరిబాస్‌కు చెందిన షేర్కాన్ రీసెర్చ్ అనలిస్ట్ అంజూ చౌదరీ పేర్కొన్నారు. ప్రస్తుత ఏడాది జూన్‌లో భారత ఎగుమతుల కంటే దిగుమతులు అధికంగా చోటు చేసుకోవడం.. రికార్డ్ స్థాయిలో వాణిజ్య లోటు 25.63 బిలియన్ డాలర్లకు ఎగిసిపడటంతో రూపాయిపై మరింత ఒత్తిడి చోటు చేసుకుంది. వచ్చే రెండు, మూడు సెషన్లలో డాలర్‌తో రూపాయి విలువ 78.50-80 మధ్య కదలాడొచ్చని చౌదరీ పేర్కొన్నారు. భారత్‌లోనూ మందగమన భయాలు, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ఎఫ్ఐఐలు వరుసగా తరలిపోవడం, ఆర్బీఐ వద్ద మారకం నిల్వలు తగ్గిపోవడం తదితర అంశాలు రూపాయిని కుదేలు చేస్తున్నాయి. రూపాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో దిగుమతి ఆధారిత అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. చమురు ధరలు ఎగిసిపడనున్నాయి. అధిక ధరలతో ఇప్పటికే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విదేశీ అప్పులు తీవ్ర భారం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మరింత పన్నుల భారాన్ని మోపనుంది. ద్రవ్యోల్బణం ఎగిసిపడనుంది. వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడనుంది.