Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూ దేవతల ఫొటోలున్న వార్తా పత్రికలో చికెన్ ప్యాక్ చేశాడని అరెస్టు
- ఓ ముస్లిం వ్యక్తిపై కేసు నమోదుచేసిన యూపీ పోలీసులు
న్యూఢిల్లీ : హిందూ దేవతల ఫొటోలున్న వార్తాపత్రిక పేపర్లో చికెన్ ప్యాక్ చేశాడని ఓ ముస్లిం వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి..జైలుకు పంపారు. చికెన్ సెంటర్ యజమాని తాలిబ్ హుస్సేన్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదుచేయటం వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులపై కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడని ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆరోపణలు నమోదుచేయటాన్ని నిందితుడి బంధువులు తీవ్రంగా ఖండించారు. తప్పుడు ఆరోపణలతో కేసులో ఇరికించారని నిందితుడి తరఫు న్యాయవాది ఆరోపించారు. రెండు వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడని తాలిబ్ హుస్సేన్‌పై పోలీసులు సెక్షన్ 153ఏ, 295, 307(హత్యాయత్నం) ఆరోపణల కింద కేసు నమోదుచేశారు. హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు కైలాష్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి, పోలీసులు నిందితుడిపై చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఈ మొత్తం ఉదంతంపై హుస్సేన్ కుమారుడు 'ద వైర్'తో మాట్లాడుతూ...''ప్యాక్ చేసిన చికెన్‌ను పాత వార్తా పత్రిక పేపర్స్‌లో చుట్టి కస్టమర్‌కు ఇవ్వటం సహజంగా జరిగేదే. ఇందులో నా తండ్రి పొరపాటేంటో అర్థం కావటం లేదు. పోలీసులు రావటం అరెస్టు చేయటం, జైలుకు పంపటం అంతా హఠాత్తుగా జరిగింది. ఆయన చేసిన నేరమేంటో తెలియటం లేదు. 20ఏండ్లుగా చికెన్ దుకాణం నడుపుతున్నాం. ఎన్నడూ ఇలాంటిది చూడలేదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన క్లయింట్‌పై పోలీసులు నమోదుచేసిన ఆరోపణలు ఆధార రహితమని హుస్సేన్ తరఫు న్యాయవాది డానిష్ అన్నారు.