Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్రం తదుపరి క్యాబినెట్ సమావేశానికి ఒక రోజు ముందు, ఎంపీలుగా పదవీకాలం రెండు రోజుల్లో ముగుస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులకు ఇది చివరి సమావేశం అవుతుంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ (బీజేపీ), కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ (జేడీయూ) ఇద్దరి రాజ్యసభ పదవీకాలం జులై 7న ముగియనుంది. అయితే బీజేపీ, జేడీయూ పార్టీలు వారిని మళ్లీ రాజ్యసభకు పంపలేదు. జులై 7తో పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎంపీలుగా ఎన్నిక కాకపోతే మంత్రులిద్దరూ మోడీ క్యాబినెట్ లో సీట్లు కోల్పోతారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని బీజేపీ మళ్లీ నామినేట్ చేయలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు నమ్మకస్తుడు, జేడీయూలో నెంబర్ 2గా ఉన్న రామచంద్ర ప్రసాద్ సింగ్ను, కొన్ని కారణాలతో ఈసారి రాజ్యసభకు పంపటం లేదు. కేంద్రమంత్రులు ఎంపీలుగా లేనప్పుడు కూడా ఆరు నెలల పాటు కొనసాగవచ్చు, కానీ అలా సాధారణంగా జరగదు. అయితే, క్యాబినెట్ అపాయింట్మెంట్ తర్వాత మంత్రులను ఎంపిలుగా చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు మంత్రుల భవితవ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా లేదంటే, ఏదైనా రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్గా పంపుతారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రామచంద్ర ప్రసాద్ సింగ్ త్వరలో బీజేపీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి నామినేషన్ తరువాత భర్తీ చేయాల్సిన ఏడు రాజ్యసభ స్థానాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇద్దరు ఎంపీలు మంత్రులుగా కొనసాగుతారా? లేక రాష్ట్రపతి సిఫారసు మేరకు రాజ్యసభకు పంపబడతారా? అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఉపరాష్ట్రపతి పదవికి ఇప్పటికే నామినేషన్లు ప్రారంభం కాగా, అధికార ఎన్డీయే కూటమి తన అభ్యర్థిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.