Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మందికి ఉచిత సివిల్ సర్వీసు శిక్షణ
- రూ. 70 లక్షలతో ప్రత్యేక కార్యక్రమం
తిరువనంతపురం : దేశంలో ప్రతి ఏటా నిర్వహించే సివిల్ సర్వీసు పరీక్షల్లో గిరిజన విద్యార్థుల భాగస్వామ్యం పెరిగేలా కేరళలోని వామపక్ష ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా సివిల్ సర్వీసు పరీక్షల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రెసిడెన్షియల్ ప్రిలిమినరీ కార్యక్రమానికి 40 మందితో కూడిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో నుంచి 20 మందిని దేశంలో వారు కోరుకున్న ఏదైనా అకాడమీలో ఉచిత శిక్షణ పొందటం కోసం ఎంపిక చేస్తారు.
దేశంలోనే మొదటిదైనా ఈ కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం గతనెల 30న ప్రారంభించింది. మొదటి దశలో భాగంగా రూ. 70 లక్షలను కేటాయించింది. అణగారిన వర్గాల నుంచి వచ్చే వారు సివిల్ సర్వీసు పరీక్షలను సాధించేలా ప్రోత్సహించటం కోసం విజయన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీసుకొచ్చింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 1.43 శాతం ఉన్న గిరిజన వర్గం అభ్యున్నతి కోసం కేరళ సర్కారు తరచూ దృష్టి సారిస్తున్నది. అలాగే, 6.17 శాతంగా ఉన్న ప్రత్యేక బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీ) పైనా దృష్టిని సారించింది. గిరిజనుల్లో అక్షరాస్యత రేటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను ఇప్పటికే ప్రవేశపెట్టింది.
రాష్ట్ర ఎస్టీ సంక్షేమ శాఖ.. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి వివిధ గిరిజన తెగలకు చెందిన 30 ఏండ్ల లోపున్న 40 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వీరు తిరువనంతపురంలోని సివిల్ సర్వీసు అకాడమీలో ఒక నెల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌కు వెళ్తారు. ఆ తర్వాత, దేశంలో ఎక్కడైనా ఉచిత శిక్షణ పొండటం కోసం వీరి నుంచి 20 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒక నెల రెసిడెన్షియల్ ట్రైనింగ్ కోసం కేరళ ప్రభుత్వం రూ. 10 లక్షలను, మరో రూ. 60 లక్షలను 20 మంది విద్యార్థుల ఉచిత కోచింగ్ కోసం కేటాయించింది. దీంతో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల సహాయం అందుతుంది.
ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఏవైనా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుంచి సివిల్ సర్వీసు పరీక్షల కోసం 20 మంది ఎస్టీ అభ్యర్థులకు శిక్షణనిచ్చిన మొదటి రాష్ట్రం కేరళ నిలుస్తుందని ఆ రాష్ట్ర ఎస్టీ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కే. రాధాకృష్ణన్ తెలిపారు. ఎల్లవేళలా ప్రజలతో ఉంటామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నదని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించటం ద్వారానే గిరిజనుల అభివృద్ధి సాధద్యమవుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తప్పనిసరైన సౌకర్యాలు, మౌలిక వసతులను అందిస్తుందని అన్నారు.
రాష్ట్ర జనాభాలో తక్కువ శాతం జనాభాను కలిగి ఉండి.. చాలా కాలంగా హక్కులు, సౌకర్యాలకు నోచుకోలేకపోతున్న గిరిజన సమూహంపై కేరళ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేటాయించింది. వారి కోసం విద్య, భూమి, గృహ, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 2021-22 బడ్జెట్లో వామపక్ష ప్రభుత్వం రూ. 735.86 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే.