Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో పెరిగిన నిరుద్యోగ రేటు
- తెలంగాణలో 10శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు
- ఏపీలో యథాతధం : సీఎంఐఈ డేటా
న్యూఢిల్లీ : దేశంలో లాక్డౌన్ వంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ జూన్ నెలలో అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో ఒక్క జూన్ నెలలోనే 1.3 కోట్ల (13 మిలియన్ల) మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగుల సంఖ్య 404 మిలియన్ల నుంచి 390 మిలియన్ల పడిపోయింది. ఇది గత 12 నెలల్లో (2021 జూలై) అత్యధికమని సీఎంఐఈ పేర్కొంది. గత రెండు నెలల్లో 40 శాతం ఉన్న శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్పీఆర్) కనిష్టంగా 38.8 శాతానికి తగ్గింది. ఉపాధిలో ఈ పతనం, ప్రధాన కార్మిక మార్కెట్ నిష్పత్తులలో క్షీణత ఆందోళనకరంగా నెలకొంది. లేబర్ మార్కెట్ క్షీణత దేశవ్యాప్తంగా ఉందని సీఎంఐఈ సీఈఓ మహేష్ వ్యాస్ అన్నారు. జూన్ 2022లో 2.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని, మిగిలిన ఉద్యోగాలు అసంఘటితరంగంలో కోల్పోయారని తెలిపారు. వ్యవసాయ రంగం జూన్లో దాదాపు 8 మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని అన్నారు.
దేశంలో పెరిగిన నిరుద్యోగ రేటు
దేశంలో నిరుద్యోగ రేటు పెరిగింది. జూన్ నెలలో 7.80 శాతం నిరుద్యోగ రేటు నమోదు అయిందనీ సీఎంఐఈ పేర్కొంది. మే నెలలో ఉన్న 7.12శాతం నిరుద్యోగ రేటు నుంచి జూన్ నెలలో 7.80శాతానికి పెరిగింది. అందులో పట్టణ నిరుద్యోగ రేటు 7.30శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 8.03శాతానికి పెరిగింది. మే నెలతో పోల్చితే పట్టణ నిరుద్యోగ రేటు కాస్తా తగ్గినప్పటికీ, గ్రామీణ నిరుద్యోగ రేటు భారీగా పెరిగింది. నిరుద్యోగ రేటు అత్యధికంగా హర్యానా (30.6 శాతం)లో నమోదు కాగా, అత్పల్పంగా పుదుచ్చేరి (0.8 శాతం)లో నమోదు అయింది.
ఏపీలో యథాతధం, తెలంగాణలో పెరుగుదల
నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్లో యథాతంగా ఉండగా, తెలంగాణలో మాత్రం పెరిగింది. మే నెలతో పోల్చితే ఏపీలో నిరుద్యోగ రేటులో మార్పు ఏమీ నమోదు కాలేదు. తెలంగాణలో మాత్రం నిరుద్యోగ రేటు 10 శాతానికి పెరిగింది. మే నెలలో ఏపీలో 4.4 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, జూన్ నెలలో కూడా అదే శాతం నమోదు అయింది. అయితే తెలంగాణలో మాత్రం మే నెలలో 9.4 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, జూన్ నెలలో 10 శాతానికి పెరిగింది. దేశంలో నిరుద్యోగ రేటు ఎక్కవ ఉన్న రాష్ట్రాల్లో హర్యానా (30.6 శాతం), రాజస్థాన్ (29.8 శాతం), అస్సాం (17.2 శాతం)మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తరువాత స్థానంల్లో జమ్మూ కాశ్మీర్ (17.2 శాతం), బీహార్ (14 శాతం), సిక్కిం (12.7 శాతం), జార్ఖండ్ (12.2 శాతం), ఢిల్లీ (10.3 శాతం), హిమాచల్ ప్రదేశ్ (10.3 శాతం), త్రిపుర (9.4 శాతం), ఉత్తరాఖండ్ (8.7 శాతం), పంజాబ్ (8.5 శాతం) రాష్ట్రాల్లో జాతీయ సగటు (7.80 శాతం) నిరుద్యోగ రేటు కంటే ఎక్కువ నమోదు అయింది. కేరళ (5.3 శాతం), మహారాష్ట్ర (4.8 శాతం), కర్ణాటక (3.7 శాతం), తమిళనాడు (2.1 శాతం), ఒరిస్సా (1.2 శాతం) రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదు అయింది.
మోడీ అబద్ధాలు : సీతారాం ఏచూరి
ఉద్యోగ కల్పనలో మోడీ సర్కార్ అబద్ధాలాడుతున్నదన్న విషయం మరోసారి స్పష్టమైందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సీఎంఐఈ రిపోర్టుపై స్పందించిన ఏచూరి ''జూన్లో ఉపాధిలో భారీ పతనం జరిగింది. మేలో 404 మిలియన్ల ఉపాధి నుంచి జూన్లో 390 మిలియన్లకు పడిపోయింది. 1.4 కోట్ల ఉద్యోగాలు పోయాయి. ఇది మోడీ అబద్ధాలను బట్టబయలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రగల్భాలు పలుకుతున్న మోడీ సర్కార్ దీనిపై ఏమంటుంది?'' అని ఏచూరి ప్రశ్నించారు.