Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంటగ్యాస్ సిలిండర్‌పై మళ్లీ రూ.50 పెంపు
- హైదరాబాద్‌లో ధర రూ.1105 .. దేశంలోనే అత్యధికం
- ఈ ఏడాదిలో రూ.244 పెంపు
- సామాన్యులపై మోడీ సర్కార్ దాడి : ఏచూరి
- ధనిక స్నేహితుల కోసం బీజేపీ పనిచేస్తోంది : కాంగ్రెస్
న్యూఢిల్లీ : ధరల తాకిడిలో కొట్టుకుపోతున్న సామాన్యుడి పరిస్థితి మోడీ సర్కార్‌కు కనిపించం లేదు. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరను బుధవారం మళ్లీ రూ.50 పెంచింది. హైదరాబాద్‌లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1105కు చేరుకుంది. జులై నెల ఆరంభమైన తర్వాత ధర పెంపుపై ప్రకటన లేకపోయేసరికి, ఈ నెల ధరల మార్పు ఉండదని అందరూ భావించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లు, ఉక్రెయిన్ సంక్షోభం, డాలర్‌తో రూపాయి మారకం పేరు చెప్పి చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ధరల్ని పెంచాయి. మే నెల నుంచి ఇలా పెరగటం మూడోసారి కాగా గడిచిన ఏడాది కాలంలో వంటగ్యాస్ ధర ఏకంగా రూ.244 పెరగడం గమనార్హం.
ధరల పెంపుపై వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించాయి. ''ఏమాత్రం కనికరం లేకుండా సామాన్యుల బతుకులపై మోడీ సర్కార్ దాడికి తెగబడింది'' అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ధనికులు, బడా కార్పొరేట్లు (సూపర్ రిచ్)పై పన్నులు పెంచి ఆదాయ వనురులు పెంచుకోవాలని సూచించారు.
ధరల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ''అత్యంత ధనిక స్నేహితుల్ని బీజేపీ కాపాడాలనుకుంటోంది. సామాన్యులను మరిచిపోయింది. ఆహార ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రికార్డ్ స్థాయిలో ఉన్నవేళ సిలిండర్ ధర పెంపు నిర్ణయం సరైంది కాదు'' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ తెలిపారు.
మూడు నెలల్లో రూ.153 పెంపు
ఈ ఏడాదిలోనే వంటగ్యాస్ ధర నాలుగుసార్లు పెరగగా, కేవలం మే తర్వాతే మూడుసార్లు పెరిగింది. పెరిగిన ప్రతిసారి దాదాపు యాభై రూపాయలకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతోంది. మార్చి 22వ తేదీన సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో యాభై పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి నెల నుంచి మొత్తంగా ఒక్కో సిలిండర్‌పై రూ.153.50 పెంచాయి. ఇలా గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు చూస్తే సిలిండర్ ధర రూ.244 ఎగబాకింది. ప్రస్తుతం వంటగ్యాస్‌పై సబ్సిడీ కేవలం ఉజ్వల పథకం కింద కనెక్షన్లు జారీ అయినవారికే అందుతోంది. మిగతావాళ్లందరికీ సబ్సిడీని మోడీ సర్కార్ ఎత్తేసింది. వీరంతా మార్కెట్ ధర చెల్లించాల్సి వస్తోంది. పలు నగరాల్లో సిలిండర్ ధర రూ.1100లు దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1053కు చేరుకోగా..ముంబయిలో రూ.1052.50, చెన్నై-రూ.1079, కోల్‌కతాలో రూ.1068.50కి చేరింది. హైదరాబాద్‌లో మాత్రం అత్యధికంగా ఒక్క సిలిండర్‌కు రూ.1105 చెల్లించాల్సి వస్తోంది. ఇంధనంపై రాష్ట్రాలు విధించే వ్యాట్లు వేర్వేరుగా ఉండటం వల్ల ఆయా రాష్ట్రాల్లో వీటి ధర మారుతోంది.
వాణిజ్య సిలిండర్‌పై బాదుడు
వంటగ్యాస్ ధర ఇలా ఉంటే, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పైనా చమురు సంస్థలు తీవ్ర భారాన్ని మోపుతూనే ఉన్నాయి. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2వేలు దాటగా ఇతర రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే, దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 85శాతం విదేశాల నుంచి దిగుమతిపైనే భారత్ ఆధారపడిన సంగతి తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతుల కోసం భారత్ భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తోందని మోడీ సర్కార్ తన చర్యల్ని సమర్థించుకుంటోంది.