Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయితో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురిసాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునగడంతో పాటు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సోమవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. ఈ నెల 6 నుంచి 10 వరకూ ముంబయి, ఇతర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పాల్ఘర్, సతారా జిల్లాలకు ఈ నెల 8 వరకూ, రాయిగఢ్, రత్నగిరి, సిందుదుర్గ్ జిల్లాలకు రానున్న నాలుగురోజులకు రెడ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. పుణే, కొల్హాపూర్ జిల్లాలకు ఈ నెల 8 వరకూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ముంబయి, థానే, రాయిగఢ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలగడం వంటి ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొన్నారు. ముంబయిలోని చునభట్టి నాగోబా చౌక్ ప్రాంతంలో మూడు ఇళ్లు కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.