Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే అంతమొందించారు!
- మధ్యప్రదేశ్లో ఆర్టీఐ కార్యకర్త హత్యపై నిజనిర్దారణ కమిటీ విచారణ
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో సమాచార హక్కు కార్యకర్త రంజీత్ సోని హత్య ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఒక ఆర్టీఐ కార్యకర్తగా రంజీత్ సోని ప్రభుత్వానికి, అవినీతి అధికారులకు ఒక కొరకరాని కొయ్యగా మారినందువల్లే ఈ హత్య జరిగిందని నిజనిర్ధారణ కమిటీ భావిస్తోంది. జూన్ 2న విదీషా నగరంలోని ప్రజా పనుల విభాగం కార్యాలయం ప్రధాన గేటు వద్ద సాయంత్రం 5 గంటల సమయంలోఅత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి రంజిత్ సోనీని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. ఘటనా స్థలం వద్ద నిజనిర్ధారణ కమిటీ జూన్ 19న విచారణ జరిపింది. అటు తర్వాత రంజిత్ కుటుంబ సభ్యుల్ని కలుసుకొని మరికొన్ని వివరాలు సేకరించింది. ఆర్టీఐ దరఖాస్తుల విషయంలో రంజీత్కు సహాయ పడుతున్న న్యాయవాదిని, విదీషా నగరంలో పనిచేస్తున్న వార్త పత్రిక జర్నలిస్టుల్ని కమిటీ కలుసుకుంది. ఈనేపథ్యంలో కమిటీ తెలుసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ పనులకు సంబంధించి వివరాలు, గణాంకాలు పొందటానికి రంజీత్ సోని విస్రృతంగా ఆర్టీఐ చట్టాన్ని వినియోగించారు. ప్రభుత్వ నిధులు దారిమళ్లాయని, అవకతవకలు జరిగాయని తెలిస్తే, ఆయన వెంటనే లోకాయుక్త, పీడబ్ల్యూడీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసేవాడు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో సమాచారం సేకరించేందుకు రంజీత్ సోనీ దాదాపు 130కిపైగా ఆర్టీఐ దరఖాస్తులు చేశారని తెలిసింది. ఇందులో అత్యధికం ప్రజా పనుల విభాగం శాఖకు సంబంధించినవి ఉన్నాయి. ప్రభుత్వ పనులు దక్కించుకునే కొంతమంది కాంట్రాక్టర్ల నుంచి రంజీత్ సోనీకి తరుచుగా బెదిరింపులు వచ్చేవని తెలిసింది. ఈ బెదిరింపుల తర్వాత పోలీసులు రక్షణ కల్పించివుంటే ఆయన ప్రాణాలు పోయేవి కావని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది.