Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాల కసరత్తు
- బీజేపీ అభ్యర్థి రేసులో ఐదుగురు
- ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ చర్చ
- త్వరలో ప్రతిపక్షాల సమావేశం
న్యూఢిల్లీ : దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ మైంది. అయినప్పటికీ అధికార, ప్రతిపక్షాల అభ్యర్థులు ఎవరనే దానిపై అనిశ్చితి నెలకొన్నది. ఇప్పటివరకూ అధికార, ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపిక ఇంకా చర్చల దశలోనే ఉన్నది.
అభ్యర్థి ఎంపికకు త్వరలో ప్రతిపక్షాల సమావేశం
ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ సిద్ధపడింది. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను సంప్రదించే బాధ్యతను రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ అప్పగించింది. త్వరలో దీనికోసం ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతానికి ప్రతిపక్షాల నుంచి అభ్యర్థుల జాబితాను రూపొందించడానికి ఏకాభిప్రాయానికి రావాలని కాంగ్రెస్ కోరుతున్నది. అభ్యర్థి తమ పార్టీ నుండే ఉండాల్సిన అవసరం లేదనీ, వేరే పార్టీ నుంచి కూడా ఉండొచ్చని, ఏకాభిప్రాయమే తమ మొదటి ప్రాధాన్యతని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. అయితే, రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గిరిజన వర్గం నుంచి వచ్చినందున ప్రతిపక్ష పార్టీల్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా, ఎన్నికల ప్రచారానికి సంబంధించి నంత వరకు ఆమెకు ప్రతిపక్షాలు గట్టి సవాలునే విసురుతున్నాయి.
బీజేపీ అభ్యర్థి ప్రకాశ్ జవదేకర్..?
అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో గోప్యత పాటిస్తూ, వదంతులకు చెక్ పెడుతూ ద్రౌపది ముర్ము పేరును అనుహ్యంగా తెరపైకి తెచ్చినట్టే.. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కూడా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. పలు మీడియా కథనాల్లో మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ మహ్మద్ ఆరీఫ్, మణిపూర్ మాజీ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ, మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేరు ముందంజలో ఉందని విశ్వనీయ వర్గాల సమాచారం.
అందుకు బలమైన కారణం లేకపోలేదని ఆయా వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో జరిగిన సంక్షోభంలో బీజేపీ పాత్రపై అక్కడ ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన జవదేకర్‌ను ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ యోచిస్తున్నదని సమాచారం.
తమ అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేంత ఎన్నికల బలం బీజేపీకి ఉన్నది. ముస్లింకు చెందిన సమర్థుడైన, వివాదాస్పద రహిత నాయకుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు తీవ్ర అన్వేషణ సాగుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ''అవసరమైన ప్రొఫైల్ ప్రకారం ఎవరూ కనుగొనబడకపోతే, ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నజ్మా హెప్తుల్లా, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఈ నలుగురి పేర్లలో ఒక పేరును ఎంపిక చేయొచ్చు'' అని ఆ బీజేపీ నేత అన్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతి ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేస్తారు. 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఆగస్టు 6న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ దాఖలు చేయడానికి జూలై 19 చివరి తేదీ కాగా, నామినేషన్ పత్రాల పరిశీలన జూలై 20న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై 22తో గడువు ముగుస్తుంది.