Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది పేదరికంలోకి మరో 9.5కోట్లమంది : ఐరాస నివేదిక
- స్థిరమైన అభివృద్ది లక్ష్యాల సాధన వైపు ప్రపంచం కదలాలి..
- భూతాపాన్ని తగ్గించాలి..
- కోవిడ్ మరణాలు ఏడాది చివరినాటికి కోటీ 50లక్షలకు చేరుకోవచ్చు!
న్యూఢిల్లీ : పర్యావరణ సంక్షోభం కారణంగా మానవాళి అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. దీనికి తోడు రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రబలింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మరో 9.5కోట్లమంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల నివేదిక-2022 (ఎస్డీజీ) తాజాగా వెల్లడించింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి ఐరాస తీర్మానంపై భారత్ సహా సభ్యదేశాలన్నీ సంతకాలు చేశాయన్నది తెలిసిందే. శాంతి, సామరస్యాలు, సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడేందుకు ఈ లక్ష్యాల సాధన దోహదపడుతుందని ఐరాస భావిస్తోంది. ఈ లక్ష్యాలను 2030కల్లా చేరుకోవాలని ఆయా దేశాలకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యానికి ఎంతదూరంలో ఉన్నాం? కొత్త సవాళ్లేంటి? మొదలైన విషయాలతో ప్రతి ఏటా ఐరాస నివేదిక విడుదల చేస్తోంది. తాజా నివేదికలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకలి, పేదరికం, ఆరోగ్యం, విద్య, మరణాలు..మొదలైన అంశాల్లో ఐరాస నిర్దేశించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్ని చేరుకోవటం కోసం అనేక దేశాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయితే రెండేండ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారి దశాబ్దాలపాటు జరిగిన ఆ కృషిని దెబ్బతీసిందని తాజా నివేదికలో ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివరినాటికి కోవిడ్ మరణాల సంఖ్య (ప్రత్యక్షంగా, పరోక్షంగా) ప్రపంచవ్యాప్తంగా కోటీ 50 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా పర్యావరణ మార్పులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని తెలిపింది. భూమిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయని పర్యావరణ మార్పులపై ఏర్పాటైన 'ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్' 'రెడ్ సిగల్' జారీచేసింది. ఉష్ణోగ్రతల పెరుగుదల అనూహ్యంగా ఉందని, దీనివల్ల అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నివేదిక పేర్కొన్నది. ఇంధన కాలుష్యం 2021లో 6 శాతం పెరిగిందని, ఇది రికార్డ్‌స్థాయి పెరుగుదలగా ఉందని తెలిపింది.
ప్రపంచమే తేల్చుకోవాలి : లూ జెన్మిన్, ఐరాస ఆర్థిక, సామాజిక సంబంధాల చీఫ్
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఐరాస ఇచ్చిన రోడ్‌మ్యాప్ ప్రపంచం ముందు స్పష్టంగా ఉంది. ఐరాస తీర్మానంపై సంతకాలు చేసిన దేశాలన్నీ లక్ష్యాల సాధనకు ఉపక్రమించాలి. 2030నాటికల్లా అర్ధవంతమైన పురోగతిని అందుకోవాలి. ఇదంతా కూడా ఆయా దేశాల చేతుల్లో ఉంది. పర్యావరణ మార్పులతో వచ్చే అనూహ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచం సిద్ధం కావాల్సి ఉంది. సామాజిక భద్రతను పెంచాలంటే, ప్రభుత్వ సేవలు మెరుగుపడాలి. క్లీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెరగాలి.
అడ్డుకోవాల్సిందే..
భూతాపాన్ని పెంచే వాయువుల ఉద్గారాన్ని కచ్చితంగా అడ్డుకోవాలి. ఇందుకోసంగానూ అన్ని దేశాలూ చర్యలు చేపట్టాలి. గ్రీన్ హౌస్ వాయువుల గరిష్టస్థాయి ఉద్గారం 2025తోనే ఆగిపోవాలి. అటు నుంచి 2045 వరకు వాటి విడుదల క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాలి. చివరికి 2050 నాటికి గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారం నెట్ జీరో స్థాయికి చేరుకోవాలని ఐరాస ప్రపంచ దేశాలను కోరుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయా దేశాలు స్వచ్ఛందంగా చేపట్టిన కార్యక్రమాల్ని పరిగణలోకి తీసుకుంటే, రాబోయే 10ఏండ్లలో గ్రీన్హౌస్ వాయువుల విడుదల 14శాతం పెరుగుతుంది. కోటీ 70లక్షల టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లో చేరవచ్చు. ఈ సంఖ్య 2040నాటికి రెండింతలు, మూడింతలు అయ్యే అవకాశముంది.
99శాతం మంది కలుషిత గాలిని పీల్చుతున్నారు..
విపత్తు ప్రమాదాల్ని తగ్గించే వ్యూహాల్ని అనేక దేశాలు అమలుజేస్తున్నాయి. ఈ చర్యలు 2015-2021 మధ్యకాలంలో రెట్టింపు అయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభాలో 99శాతం కలుషితమైన గాలిని పీల్చుతున్నారు. ఈనేపథ్యంలో అధిక జనాభా, వెనుకబడిన దేశాలపై పర్యావరణ మార్పుల ప్రభావం తీవ్ర స్థాయిలో పడుతోందని నివేదిక తెలిపింది. ఉదాహరణకు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కోల్పోవచ్చు. దాంతో వారికి ఇంటిబాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా వెనుకబడిన, అధిక ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న దేశాల్లో మహిళలు హింసకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని కరోనా సంక్షోభం మరింత పెంచింది.