Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు డెవలపర్స్‌కు అనుకూలంగా కేంద్రం కొత్త నిబంధనావళి
- ఆదివాసీ, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా ప్రాజెక్టులకు అనుమతి
- గ్రామసభ, నిర్వాసితులకు పరిహారం..అంతా తూతూమంత్రం
- అటవీ భూముల్ని లాక్కోవటమే : రాజకీయ విశ్లేషకులు
- అటవీ హక్కుల చట్టానికి ఇది విరుద్ధం
న్యూఢిల్లీ : అడవుల్ని నమ్ముకొని బతుకుతున్న కోట్లాది మంది బతుకు ఆగం చేసే నిర్ణయం మోడీ సర్కార్ తీసుకుంది. ఆదివాసీలు, గిరిజనుల అనుమతి అవసరం లేకుండా అటవీ భూముల్ని వివిధ ప్రాజెక్టులకు వినియోగించే ప్రక్రియకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 'అటవీ పరిరక్షణ నిబంధనావళి, 2022'ను నోటిఫై చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రయివేటు డెవలపర్స్ చేపట్టే చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించింది. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా...భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని ప్రయివేటు డెవలపర్స్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధానం ప్రయివేటు డెవలపర్స్‌కు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం-2003లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాత నిబంధనావళి ప్రకారం, మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా..అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు.
బతుకులు ఆగం
మనదేశంలో అడవుల్ని నమ్ముకొని కోట్లమంది జీవిస్తున్నారు. గనుల తవ్వకం, విద్యుత్ ప్రాజెక్ట్‌లు..మొదలైనవాటి కోసం అడువుల నరికివేతకు మోడీ సర్కార్ సిద్ధమవుతోంది. బడా కార్పొరేట్లకు కేటాయించిన ఆ ప్రాజెక్టుల కోసం చట్టాల్లో మార్పులు చేస్తోంది. కొత్త నిబంధనావళిని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ అడవుల్ని నరికివేసి..భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా ? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
అంతా కేంద్రం చేతుల్లో...
ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా కూడా అత్యంత ప్రమాదకరమైనదిగా పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేంద్రం నిబంధనావళిని రూపొందించిందని విమర్శించారు. 'వేదాంత' కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా నిబంధనావళి ఉందని తెలిపారు. ముందుగా స్థానిక ఆదివాసీలు, గిరిజనుల అనుమతి తీసుకున్నాకే ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతామని 2015లో కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పుడు దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అటవీ భూముల వాడకంపై కేంద్రం అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అటవీ భూముల్లో ప్రాజెక్ట్ చేపట్టడానికి ప్రయివేటు డెవలపర్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చాక, జిల్లా కలెక్టర్ చేసేదేముంటుంది? గ్రామ సభ ద్వారా అభిప్రాయం, స్థానిక ఆదివాసీలు, గిరిజనుల హక్కుల పరిరక్షణ..అంతా తూతూమంత్రంగా మారుతుంది. ఇదంతా అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించటమే. 'అటవీ పరిరక్షణ నిబంధనావళి-2022'లో అనుమతుల ప్రక్రియ అంతా ప్రయివేటు డెవలపర్స్‌కు అనుకూలంగా ఉంది.
- శరత్చంద్ర లేలే, అడవులు, పర్యావరణ పరిశోధకులు.