Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యధికంగా తగ్గిన వరి సాగు
- దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించినా పెరుగుదల అంతంతే
న్యూఢిల్లీ : ఈ వారంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 17 శాతం పడిపోయింది. రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినా ఇదే పరిస్థితి నెలకొంది. మిగిలిన మూడు వారాల్లో విత్తనాలు వేసే వేగం పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నెలలో సాధారణ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో జూన్-సెప్టెంబర్ రుతుపవనాల సీజన్లో అత్యంత తేమగా ఉంటుంది.
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వారంతపు గణంకాల ప్రకారం జూలై 2-8 మధ్య కాలంలో 127.94 లక్షల హెక్టార్లు విస్తీర్ణంలో సాగు జరిగింది. అదే గతేడాది 153.81 లక్షలహెక్టార్ల విస్తీర్ణం సాగు జరిగింది. జూన్ 25-జూలై 1 మధ్య కాలంలో రైతులు 138.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేశారు. ఖరీఫ్ పంటల మొత్తం విస్తీర్ణం శుక్రవారం నాటికి 406.66 లక్షల హెక్టార్లు ఉంది. అదే గతేడాది 448.23 లక్షల హెక్టార్ల సాగు జరిగింది. అంటే గతేడాది కంటే ఈ ఏడాది 41.57 లక్షల హెక్ట్టార్ల (9.3 శాతం) విస్తీర్ణం సాగు తగ్గింది.
అత్యధికంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం
వరిసాగు విస్తీర్ణం తగ్గుదల కొనసాగింది. జూలై 8 నాటికి ఇది 72.24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. అదే 2021లో ఇదే కాలంలో 95 లక్షల హెక్ట్టార్ల విస్తీర్ణం సాగు జరగగా 2020లో 126.1 లక్షల హెక్ట్టార్ల విస్తీర్ణం సాగు జరిగింది. ఉత్తరప్రదేశ్ మినహా ఇతర అన్ని వరి పండించే రాష్ట్రాలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేశాయి. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం 46.10 లక్షల హెక్ట్టార్ల నుంచి 1 శాతం పెరిగి 46.55 లక్షల హెక్టార్లకి పెరిగింది.
నూనెగింజల సాగు విస్తీర్ణం 97.56 లక్షల హెక్ట్టార్ల నుంచి 20.3 శాతం (19.76 లక్షల హెక్టార్లు) తగ్గి 77.80 లక్షల హెక్ట్టార్లకి చేరింది. సోయాబీన్ విస్తీర్ణం 22 శాతం, క్షీణించి 54.43 లక్షల హెక్టార్లకు చేరుకుంది. వేరుశనగ సాగు విస్తీర్ణం 19 శాతం తగ్గి 20.51 లక్షల హెక్టార్ల్లకు చేరుకుంది. తృణధాన్యాల సాగు విస్తీర్ణం 64.36 లక్షల విస్తీర్ణం నుండి 65.31లక్షల హెక్టార్లకు స్వల్పంగా పెరిగింది. అయితే మొక్కజొన్న విస్తీర్ణం 23.5 శాతం క్షీణించి 31.84 లక్షల హెక్ట్టార్లకు చేరుకుంది.
పత్తి సాగు విస్తీర్ణం 84.6 లక్షల హెక్టార్లు చేరుకుంది. ఇది గతేడాది కంటే స్వల్పంగా తగ్గింది. గతేడాది పత్తి సాగు విస్తీర్ణం 84.75 లక్షల హెక్టార్లలో జరిగింది. అదేవిధంగా, జనపనార సాగు విస్తీర్ణం 6.91 లక్షల హెక్ట్టార్ల నుండి 6.86 లక్షల హెక్టార్లకు తగ్గింది. చెరకు సాగు విస్తీర్ణం 53.56 లక్షల హెక్టార్ల నుండి 53.31 లక్షల హెక్టార్లకు తగ్గింది.
వర్షపాతం నమోదు
జూన్ 1-జూలై 8 మధ్య దేశం మొత్తం మీద సాధారణం కంటే 2 శాతం వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సానుకూలంగా ఉండటం ఇదే మొదటిసారి. తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో సాధారణం కంటే వరుసగా 4 శాతం, 13 శాతం ఎక్కువ వర్షాలు పడగా, వాయువ్య, మధ్య ప్రాంతాలలో లోటు ఇప్పుడు సాధారణ స్థాయికి తగ్గింది. జూన్ 29 వరకు వాయువ్య ప్రాంతంలో 20 శాతం, మధ్య భారతదేశంలో 33 శాతం లోటు ఉండగా, ఇప్పుడు ఆ లోటు రెండు ప్రాంతాలకు వరుసగా 3 శాతం, 4 శాతంగా ఉంది. తక్కువ వ్యవధిలో అధిక వర్షాలు కురిసి, ఆ తర్వాత ఎక్కువ కాలం పొడిగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పంటకు మంచిది కాదు. అయితే, ఈ సీజన్లో అధిక వర్షపాతం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్లో విత్తనాలు అంతగా ప్రభావితం కాలేదు. ఎందుకంటే రైతులు ఇప్పటివరకు 35.8 లక్షల హెక్ట్టార్ల విస్తీర్ణంలో పంటలు వేశారు. గతేడాది 36.4 లక్షల హెక్ట్టార్ల విస్తీర్ణంలో సాగు చేశారు.